ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనిపెట్టడంలో అమెరికాకు సహకరించిన పాక్ వైద్యుడు షకీల్ అఫ్రిది జైలులో నిరాహారదీక్ష చేపట్టారు. జైలుశిక్షను సవాల్ చేస్తూ అఫ్రిది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణను పదేపదే వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు పూనుకున్నట్లు అఫ్రిది తరఫు న్యాయవాది తెలిపారు.
అఫ్రిది కేసు ఇదీ..
పాకిస్థాన్‌లో బిన్ లాడెన్ ఆచుకీ తెలుసుకునేందుకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ నకిలీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించింది. అబోటాబాద్‌లో ఈ కార్యక్రమం అఫ్రిది ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన ఇచ్చిన ఆధారాలతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి లాడెన్ పాక్‌లోనే ఉన్నాడని నిర్ధరించుకుంది అమెరికా. అనంతరం లాడెన్ జాడ తెలుసుకొని మట్టుబెట్టింది.
లాడెన్ మరణించిన ఏడాది తర్వాత పాక్ ప్రభుత్వం అఫ్రిదికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలతో అరెస్ట్ చేసింది. ఈ కేసులో అతడికి 33ఏళ్లు శిక్ష విధించింది పాక్ న్యాయస్థానం.
సీఐఏకు సహకరించినట్లు నిర్ధరణ కాగా దేశద్రోహం కేసు కింద అఫ్రిదిని దోషిగా తేల్చింది పాక్ గిరిజన ప్రాంతాల్లోని కోర్టు. జైలుశిక్షను 33 నుంచి 23 ఏళ్లకు తగ్గించింది. 2019 జూన్‌లో ఈ కేసు పెషావర్ హైకోర్టుకు వెళ్లినా అక్కడా ఎలాంటి పురోగతి లేకుండానే వాయిదా పడిందని అఫ్రిది తరఫు న్యాయవాది తెలిపారు.
"ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అఫ్రిది శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో అమానవీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఆయన కేసు 65 సార్లు వాయిదా పడింది. ఇది చాలా అన్యాయం. ఇలాంటి నిబంధనలు ఏ చట్టంలోనూ లేవు."
- కరమ్ నదీమ్, ఆఫ్రిది తరఫు న్యాయవాది
ఇదీ చూడండి: పీఠం కోసం ట్రంప్ దాసోహం- యుద్ధ ఫలాలు సమర్పితం