పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మేజర్ ఖమర్ జావెద్ భజ్వా పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
"జనరల్ భజ్వా సైన్యాధ్యక్షడి పదవీ కాలాన్ని మరో 3 ఏళ్లు పెంచుతున్నాం. ప్రస్తుత పదవీ కాలం పూర్తయిన తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ప్రాంతీయ భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు."
- పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం
త్వరలోనే ముగియనున్న జావెద్ భజ్వా పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని తొలుత భావించారు ఇమ్రాన్. అయితే మూడేళ్ల పాటు పెంచాలన్న భజ్వా ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని మేజర్ జావెద్ భజ్వా తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీరీలకు పాకిస్థాన్ అండంగా ఉంటుందని గతంలో చెప్పారు. వారి స్వాతంత్ర్య పోరాటానికి పాకిస్థాన్ సైన్యం మద్దతునిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఎన్నిక ఏకగ్రీవం