ఆగస్టు 15.. భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు. తెల్లదొరలపై పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కిన రోజు. 1947లో బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి ఏటా ఆగస్టు 15న భారతీయులమంతా గర్వంగా.. ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటూ ఉన్నాం. మనం సరే.. ఇదే రోజున మనతోపాటు మరికొన్ని దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని మీకు తెలుసా?
కొరియా
జపాన్ పాలనలో నలిగిపోయిన ఉమ్మడి కొరియా దేశం 1945లో ఇదే రోజున స్వాతంత్ర్యం పొందింది. 1910 నుంచి ఉమ్మడి కొరియాపై జపాన్ అధికారం చలాయించింది. అయితే రెండో ప్రపంచయుద్దం సమయంలోనే యూఎస్, సోవియేట్ ఆర్మీలతో కలిసి జపాన్‌పై కొరియా పోరాడింది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ సైన్యం ఓడిపోయింది. దీంతో 1945 ఆగస్టు 15న మిత్ర రాజ్యాలకు లొంగిపోతున్నట్లు అప్పటి జపాన్ చక్రవర్తి హిరోహిటో ప్రకటించారు. దీంతో కొరియాపై జపాన్ ఆధిపత్యం కూడా ముగిసింది. అదే రోజున కొరియా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే మూడేళ్ల తర్వాత అంటే 1948లో కొరియా రెండు దేశాలుగా విడిపోయింది. యూస్‌కి అనుకూలంగా దక్షిణ కొరియా.. సోవియేట్‌కు అనుకూలంగా ఉత్తర కొరియా ఏర్పడ్డాయి. అయినా ఇరు దేశాలు ఆగస్టు 15ను నేషనల్ లిబరేషన్ డేగా జరుపుకొంటున్నాయి.
రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో
1880లో ఉత్తర కాంగోప్రాంత నది పరివాహక ప్రాంతాలను ఫ్రాన్స్ ఆక్రమించి ఫ్రెంచ్ కాలనీలుగా ఏర్పర్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా మధ్య కాంగో సహా అనేక ప్రాంతాలను స్వాధీన పర్చుకొని ఫ్రెంచ్ కాలనీలుగా మార్చింది. 1908లో తన అధీనంలో ఉన్న ప్రాంతాన్ని ఫ్రెంచ్ ఈక్వటోరియల్ ఆఫ్రికాగా నామకరణం చేసింది. కాంగోలోని బ్రజవిల్లేను రాజధానిగా చేసుకొని పాలన కొనసాగించింది. అయితే 1958లో అమల్లోకి తెచ్చిన రాజ్యాంగం 5వ సవరణ ప్రకారం కాంగోలోని ఫ్రెంచ్ కాలనీలను విభజించి.. వాటికి స్వయంప్రత్తిని కల్పించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మధ్య కాంగో ‘రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో’గా ఏర్పడింది. మరుసటి ఏడాది ఈ దేశంలో ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే ఆ తర్వాత ఫ్రాన్స్ సైన్యంపై రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో తిరుగుబాటు చేసి 1960 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
బహ్రెయిన్
బహ్రెయిన్‌కు ఎంతో చరిత్ర ఉంది. వందకుపైగా ఐలాండ్స్.. ఇసుక దిబ్బలు కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని అనేక మంది చక్రవర్తులు పరిపాలిస్తూ వచ్చారు. అయితే బ్రిటిష్‌తో చేసుకున్న ఒప్పందాలతో బహ్రెయిన్‌పై తెల్లదొరల పరిపాలన సాగేది. బహ్రెయిన్ ఇరాన్ రాజ్యంలోనిదే అయినా 1970లో స్వతంత్ర దేశం ఏర్పాటుకు అప్పటి ఇరాన్ చక్రవర్తి మహ్మద్ రెజా పహల్వీ ఒప్పుకున్నారు. అయినా బహ్రెయిన్ బ్రిటిష్ పాలనలోనే ఉండిపోయింది. అయితే 1971 ఆగస్టు 15న ఐక్యరాజ్యసమితి బహ్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉండటంపై రెఫరెండం నిర్వహించింది. ఫలితంగా బహ్రెయిన్ అధికారికంగా స్వతంత్ర దేశంగా ఏర్పడింది.