అది అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని(Afghanistan Kabul) ప్రధాన జైలు. వేలాది మంది తాలిబన్లు(Afghan Taliban).. గతంలో అరెస్టై అక్కడే శిక్ష అనుభవించారు. కానీ.. ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. ఆ తాలిబన్లు.. అదే జైలును ఏలుతున్నారు. అవును.. ఇప్పుడు అక్కడ వారే బాస్‌లు.


గత నెల 15న అధ్యక్షుడు అఫ్రాఫ్ ఘనీ(Ashraf Ghani) పారిపోయాక.. దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వచ్చింది. తర్వాత ప్రభుత్వమూ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారులు సహా ఎందరో దేశం విడిచి వెళ్లిపోయారు. కాబుల్‌లోని పుల్-ఏ-ఛర్ఖీ జైలు నిర్వాహకులు, సంరక్షకులు కూడా పరారయ్యారు. ఇప్పుడా కారాగారం పూర్తిగా తాలిబన్ల నియంత్రణలోకి వచ్చింది.


ఒకప్పుడు ఆ జైల్లో ఖైదీలుగా గడిపిన తాలిబన్లే.. ఇప్పుడు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఓ తాలిబన్ కమాండర్.. తన స్నేహితులతో కలిసి జైలు పర్యటనకు కూడా వెళ్లాడు. అప్పటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏ భయం లేకుండా వచ్చినందుకు.. చాలా సంతోషంగా ఉందని చెప్పడం గమనార్హం.

''దశాబ్దం కిందట.. నన్ను ఈ జైల్లోకి కళ్లకు గంతలుకట్టి తీసుకొచ్చారు. ఆ రోజుల్ని తలచుకుంటేనే భయమేస్తుంది. ఖైదీలు ఎన్నో వేధింపులు, హింసకు గురయ్యారు. నేను 14 నెలలు జైల్లోనే ఉన్నాను. అవి నా జీవితంలో చీకటి రోజులు.''
- ఓ తాలిబన్ కమాండర్
కాబుల్‌ను ఆక్రమించుకున్న తర్వాత.. తాలిబన్లు అక్కడి జైళ్లలోని ఖైదీలను విడిచిపెట్టారు. అయితే.. ఇప్పుడు పుల్-ఏ- ఛర్ఖీ జైల్లో 60 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిలో చాలా మంది నేరస్థులు, మాదక ద్రవ్యాలకు బానిసైన వాళ్లే.

ఇవీ చూడండి: ప్రపంచ దేశాల ఉదారత- అఫ్గాన్‌కు 1.2 బిలియన్ డాలర్ల సాయం!
Afghan Taliban : తాలిబన్లకు గుర్తింపు కోసం పాక్-చైనా విశ్వప్రయత్నాలు!