కరోనా వైరస్‌పై గరిష్ఠ స్థాయిలో అప్రమత్తతను కొనసాగించాలని అధికారులను ఉత్తరకొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. దేశంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పునరుద్ఘాటించిన కిమ్... వైరస్ నియంత్రణ కార్యక్రమంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే దేశం ఊహించని విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అధికార పార్టీ సమావేశంలో మాట్లాడిన కిమ్ జోంగ్ ఉన్.. దేశంలో ప్రాణాంతక మహమ్మారి వైరస్ ప్రవేశాన్ని పూర్తిగా నిరోధించామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం నెలకొన్నా ఉత్తర కొరియా మాత్రం సమర్థంగా నియంత్రణ విధానాలను అమలు చేసిందని అన్నారు.
కఠిన చర్యలతో కట్టడి..
వైరస్ నిరోధక చర్యలను జాతీయ ఉనికికి సంబంధించినవిగా వివరిస్తూ, ఉత్తర కొరియా దాదాపు అన్ని సరిహద్దులను మూసివేసింది. పర్యటకులను నిషేధించింది. దేశంలోకి వచ్చే ప్రాంతాల్లో స్క్రీనింగ్‌ను కఠినంగా అమలు చేసింది. ప్రజలను పరీక్షించి వ్యాధి లక్షణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు 10 వేల మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించింది.
ఇప్పటికే అమెరికా ఆంక్షలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా ఆర్థిక పరిస్థితి ఈ లాక్డౌన్ కారణంగా దారుణంగా దెబ్బతిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ దేశంలో వైరస్ విజృంభిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య వసతులు లేకపోవటం వల్ల భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కరోనా విజృంభణ.. అమెరికాలో మరో 57 వేల కేసులు