North Korea Missile Test: క్షిపణి ప్రయోగాల్లో తగ్గేదేలే అంటోంది ఉత్తర కొరియా. నెల రోజుల వ్యవధిలోనే మూడో పరీక్ష నిర్వహించింది. ఈ సారి రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అమెరికా ఇటీవలే కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. తాము ఎవరికీ బెదరబోమనే సంకేతాన్ని ఇచ్చేందుకే కిమ్ దేశం శుక్రవారం ఈ పరీక్ష చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం నిర్వహించిందని, కానీ అది ఎక్కడ ల్యాండ్ అయ్యిందో చెప్పలేమని దక్షిణ కొరియా తెలిపింది. ఇంతకుమించి మరే వివరాలు వెల్లడించలేదు.
ఉత్తర కొరియా ప్రయోగించింది బాలిస్టిక్ క్షిపణి అయి ఉండవచ్చని జపాన్ ప్రధాని కార్యాలయం, ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది. ఇప్పటికే అది ల్యాండ్ అయి ఉండవచ్చని, తీరప్రాంత రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందిస్తున్న ఐదు సంస్థలపై అమెరికా బుధవారం ఆంక్షలు విధించింది. ఆ దేశంపై కొత్త ఆంక్షలు అమలు చేయాలని ఐక్యరాజ్యసమితిని కూడా కోరతామని చెప్పింది.
అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవాలనే లక్ష్యంతోనే కిమ్ జోంగ్ ఉన్ సర్కార్ ఎవరినీ లెక్క చేయకుండా వరుసగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఒక్క నెల వ్యవధిలోనే మూడు క్షిపణులను పరీక్షించింది. తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వీటిని చేపడుతున్నట్లు తన చర్యను సమర్థించుకుంటోంది.
ఇదీ చదవండి: పాక్ కొత్త జాతీయ భద్రత విధానం- చరిత్రలో తొలిసారి పౌరులకు ప్రాధాన్యం