అంతర్జాతీయ ఆంక్షలు బేఖాతరు చేస్తూ మరో కీలక క్షిపణి పరీక్ష నిర్వహించింది ఉత్తర కొరియా. అణునిరాయుధీకరణ చర్చలను అమెరికా తిరిగి ప్రారంభించేందుకు కిమ్ సర్కారు విధించించిన తుది గడువు దగ్గర పడుతున్న వేళ ఈ ప్రకటన చేసింది ఆ దేశ అధికారిక మీడియా.
డిసెంబర్ 13న సోహే ప్రయోగ కేంద్రం నుంచి ఈ కీలక పరీక్ష చేపట్టినట్లు తెలిపింది ఉత్తర కొరియా. ఈ విజయంతో అణు దాడుల్ని ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరిగిందని ప్రకటనలో పేర్కొంది. అయితే ఆ ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
గురువారం పసిఫిక్ మహాసముద్రంలో మధ్యశ్రేణి క్షిపణిని పరీక్షించింది అమెరికా. ఉత్తర కొరియా వ్యవహారంపై చర్చించేందుకు రేపు అమెరికా ప్రత్యేక ప్రతినిధి దక్షిణ కొరియా రాజధాని సియోల్ రానున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కిమ్ సర్కారు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్ష కోసం సోహే ప్రయోగ కేంద్రాన్ని ఎంచుకోవడమూ చర్చనీయాంశమైంది. ఆ
కేంద్రాన్ని మూసివేస్తామని గతేడాది దక్షిణ కొరియా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చింది ఉత్తర కొరియా.
త్వరలో మరొకటి!
అంతర్జాతీయ ఒత్తిళ్లతో దిగొచ్చిన ఉత్తర కొరియా... అమెరికాతో సంధి కోసం ప్రయత్నించింది. 2018 జూన్ తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మూడు సార్లు సమావేశమయ్యారు కిమ్ జోంగ్ ఉన్. అయితే ఫిబ్రవరిలో జరిగిన సమావేశం తర్వాత అణునిరాయుధీకరణ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.
చర్చలు పునఃప్రారంభించేలా అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది ఉత్తర కొరియా. ఈ ఏడాది చివర్లోగా చర్చలకు రాకపోతే 'క్రిస్మస్ కానుక' ఇస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇందుకు అనుగుణంగా మరికొద్ది రోజుల్లో ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.