అమెరికాకు పక్కలో బల్లెంలా... తరచూ అణుపరీక్షలు జరుపుతూ వివాదాలకు తెరతీసే ఉత్తరకొరియా తన అణుశక్తి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ విధానాలను రూపొందిస్తున్నట్లు అక్కడి అధికారిక మీడియా 'కేసీఎన్‌ఏ' వెల్లడించింది. గత కొన్ని రోజులుగా సెంట్రల్ మిలిటరీ కమిషన్‌తో కిమ్ జోంగ్ ఉన్ విస్తృత సమావేశాలు జరిపినట్లు పేర్కొంది. అయితే, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అలాగే సైనిక బలగాల్ని మరింత పటిష్ఠం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చలు జరిగినట్లు వెల్లడించింది.
మిలిటరీ విద్యాసంస్థల బాధ్యతలు, పాత్రను కూడా పెంచాలని కిమ్ నిర్ణయించినట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. రక్షణ వ్యవస్థల మధ్య లక్ష్యాల్ని చేరుకునేలా మిలిటరీ కమాండ్ వ్యవస్థని పునర్‌వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. రక్షణ వ్యవస్థలోని రాజకీయ, సైనికపరమైన లోటుపాట్లపైనా చర్చించి వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు పేర్కొంది. ఇప్పటికే పలు శక్తిమంతమైన ఆయుధాల్ని పరీక్షించి ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిన కిమ్ తాజా చర్యలతో ఈసారి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారోననే దానిపై చర్చ జరుగుతోంది.
అణుపరీక్షల వైపు ట్రంప్ అడుగులు...
1992 తర్వాత తొలిసారి అణు పరీక్షలు జరిపేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తుందంటూ ప్రముఖ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్'లో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఈ తరుణంలో కిమ్ వ్యూహాలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా, రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్లకు హెచ్చరికగా అగ్రరాజ్యం అణుపరీక్షలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఆరోగ్యంపై వదంతులు!
గత నెల కిమ్ ఆరోగ్యంపై భారీ స్థాయిలో వదంతులు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందన్న ఊహాగానాలు జోరుగా కొనసాగాయి. అయితే, వాటన్నింటికీ తెరదించుతూ మూడు వారాల తర్వాత ఓ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనితో ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధరణ అయ్యింది. అప్పటి నుంచి తిరిగి ఓ అధికారిక కార్యక్రమంలో కిమ్ పాల్గొనడం ఇదే తొలిసారని కేసీఎన్‌ఏ తెలిపింది.
ఇదీ చూడండి: అణు పరీక్షల వైపు ట్రంప్ అడుగులు.. చైనా కోసమేనా!