నేపాల్ సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశ పార్లమెంట్ ప్రతినిధుల సభను ఐదు నెలల్లోనే రెండోసారి పునరుద్ధరించింది. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బాను రెండు రోజుల్లోగా ప్రధానమంత్రిగా నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.
275 మంది సభ్యులున్న నేపాల్ పార్లమెంటను ఆ దేశ రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ మే 22న రెండోసారి రద్దు చేశారు. ప్రభుత్వం ఏర్పాటులో అధికార, ప్రతిపక్షాలు విఫలం కావడం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 12, 19 తేదీల్లో రెండు విడతలుగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
ఎన్నికల నిర్వహణ కోసం గతవారం ఎన్నికల సంఘం.. షెడ్యూల్ను కూడా ప్రకటించింది. అయితే.. పార్లమెంటు రద్దును వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్ష కూటమి నేపాలీ కాంగ్రెస్ సహా 30 మంది వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాష్ట్రపతి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం..షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానిగా నియమించాలని సోమవారం తీర్పు చెప్పింది.
అంతకుముందు.. గత డిసెంబరు నెలలో పార్లమెంటును ఒకసారి రద్దు చేయగా, అది రాజ్యాంగ విరుద్ధమంటూ ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మళ్లీ ఓలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, పార్టీలోని అంతర్గత గొడవల కారణంగా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఎదురైంది.
ఇదీ చూడండి: నేపాల్ అనిశ్చితి రాజకీయాల్లోనూ ఓలీ ధీమా