నేపాల్ కమ్యునిస్టు పార్టీ(ఎన్సీపీ) ఏకీకరణను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, ప్రచండ పుష్ప కుమార్ దహాల్ కలిసి ఎన్సీపీ ఏర్పాటు చేయడానికి పూర్వమే.. రిషిరామ్ కట్టేల్ అనే వ్యక్తి అదే పేరుతో పార్టీని నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో.. ఇదివరకే నమోదైన పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
2018 మేలో.. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్-(సీఎంపీ-యూఎంఎల్)), పుష్పకుమార్ దహాల్ ఆధ్వర్యంలోని కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు సెంటర్(సీపీఎన్(ఎంసీ)) పార్టీలు కలిసి నేపాల్ కమ్యునిస్టు పార్టీగా ఏర్పడ్డాయి.
దీనిపై రిషిరామ్ కట్టేల్ 2018 మే నెలలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్సీపీ నమోదు చేయడానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తీర్పును రిషిరామ్ కట్టేల్కు అనుకూలంగా వెలువరించింది. సీపీఎన్-యూఎంఎల్, సీపీఎన్(ఎంసీ) పార్టీలు ఏకీకరణకు ముందు ఉన్నస్థితికి చేరుకుంటాయని పేర్కొంది. పార్టీలను మళ్లీ విలీనం చేయాలనుకుంటే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కోర్టు నిర్ణయంతో దేశ పార్లమెంట్లో ఎన్సీపీకి ఉన్న సీట్లు పార్టీల వారిగా విభజించనున్నారు. 2017 ఎన్నికల్లో యూఎంఎల్ పార్టీ 121 స్థానాలు గెలుచుకోగా, మావోయిస్ట్ సెంటర్ 53 సీట్లలో విజయం సాధించింది.
పార్లమెంట్ సమావేశాలు
మరోవైపు, పార్లమెంట్ పునరుద్ధరణ తర్వాత తొలిసారి సమావేశమైన ఆ దేశ దిగువ సభ సమావేశాలను ఇరు వర్గాలు బహిష్కరించాయి. సమావేశానికి హాజరయ్యేందుకు పార్లమెంట్ భవనానికి చేరుకున్న ప్రధాని ఓలి.. సభ ప్రారంభానికి ముందే అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, కార్యకలాపాలు కొనసాగుతుండగా.. ప్రచండ అనుకూల వర్గం సభ నుంచి వాకౌట్ చేసింది.
ఇదీ చదవండి: భారత కరోనా టీకా తీసుకున్న నేపాల్ ప్రధాని