నేపాల్ రాజకీయ సంక్షోభం మరోసారి సుప్రీం కోర్టుకు చేరింది. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రతినిధుల సభను రద్దు చేయాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సిఫారసు చేయగా రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ అందుకు అనుగుణంగా రెండు రోజుల క్రితం ప్రకటన జారీ చేశారు.
అయితే.. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రతిపక్ష నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానమంత్రిగా నియమించాలని పిటిషన్‌లో పేర్కొంది. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్రపతి ప్రకటనను రద్దు చేసి ఎప్పటిలాగే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. రాజ్యాంగ విరుద్ధంగా రాత్రికి రాత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రతినిధుల సభను రద్దు చేశారని ఆరోపించింది.
మే 14న ప్రధానిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలి బలనిరూపణకు వెనక్కి తగ్గగా, రాష్ట్రపతి విద్యా దేవీ భండారీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ఇతర రాజకీయ పార్టీలను కోరారు. అధికార, విపక్ష కూటములు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వేర్వేరుగా లేఖలు సమర్పించాయి. అయితే, అనూహ్యంగా సభను రద్దు చేసిన రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ.. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి- ఇజ్రాయెల్- హమాస్ పోరుకు అడ్డుకట్ట పడినట్లేనా?