పార్లమెంటును అర్థాంతరంగా రద్దు చేసిన విషయంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి ఆ దేశ సుప్రీంకోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఓలీ నిర్ణయంపై రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పార్లమెంటును రద్దు చేయలనే ఓలీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని నేపాల్ సుప్రీంకోర్టులో బుధవారం 13 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చోలేంద్ర శుంశేర్ రాణా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.
పార్లమెంటు రద్దుకు ప్రధాని ఓలీ చేసిన సిఫారసులు, వీటికి ఆమోదం తెలిపిన రాష్ట్రపతి నిర్ణయాలకు సంబంధించి అసలు ప్రతులను కూడా న్యాయస్థానానికి సమర్పించాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేబినెట్ విస్తరణ..
నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ప్రచండ, కేపీ శర్మ ఓలీ మధ్య వర్గపోరు కారణంగా పార్లమెంటు రద్దయింది. ప్రచండకు మద్దతుదారులైన ఏడుగురు నేతలు తమ కేబినెట్ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మంత్రిమండలిని విస్తరించేందుకు శుక్రవారం సాయంత్రం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు కేపీ శర్మ ఓలీ. ఆయన కేబినెట్లో సహాయ మంత్రులతో కలిపి ప్రస్తుతం 18 మంది మంత్రులున్నారు.