నేపాల్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ) సిద్ధమవుతోంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాస పరీక్షలో ఓడిపోవడం వల్ల కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలకు గురువారం వరకు గడువిచ్చారు రాష్ట్రపతి విద్యా దేవి భండారీ. దీంతో పార్టీ బాధ్యులతో మంగళవారం సమావేశమైన షేర్ బహాదుర్ దేయుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్.. సీపీఎన్-ఎంసీ, జేఎస్పీఎన్ల సభ్యుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
మ్యాజిక్ ఫిగర్ 136
నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 271 స్ధానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 136 సభ్యుల మద్దతు అవసరం. ప్రధాన ప్రతిపక్షం ఎన్సీకి 61, పుష్ప కమల్ దాహల్ 'ప్రచండ' నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మవోయిస్టు సెంటర్(సీపీఎన్-ఎంసీ)కు 49 సీట్లున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 26 సభ్యుల మద్దతు అవసరమవుతుంది. జనతా సమాజ్వాదీ పార్టీ నేపాల్(జేఎస్పీఎన్)కు చెందిన 32 సభ్యుల మద్దతు కూడా తమకు లభిస్తుందని ఎన్సీ భావిస్తోంది. సీపీఎన్-యూఎంఎల్లోని మాధవ్ కుమార్ నేపాల్ వర్గం కూడా తమకు అండగా ఉంటుందని ఆశిస్తోంది.
ఎన్సీకి మద్దతిచ్చే విషయమై జేఎస్పీఎన్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఆ పార్టీలో మహంత ఠాకూర్, రాజేంద్ర మహాతో వర్గానికి చెందిన 15 మంది సభ్యులు సోమవారం జరిగిన విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్నారు. జేఎస్పీఎన్ సభ్యులు తమకు మద్దుతుగానే ఉంటారని ఆశిస్తున్నట్లు ఎన్సీ జాయింట్ జనరల్ సెక్రెటరీ ప్రకాశ్ శరణ్ మహత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు పూర్తి మద్దతు ఉంటుందని పుష్ప కుమర్ దాహల్ 'ప్రచండ' హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
వారితో రాజీనామా..
ఒకవేళ జేఎస్పీఎన్ సభ్యులు తమకు అనుకూలంగా ఉండకపోతే సీపీఎన్-యూఎంఎల్లోని మాధవ్ కుమార్ వర్గానికి చెందిన 28 సభ్యులను మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని ఎన్సీ భావిస్తోంది. అప్పుడు ప్రతినిధుల సభలో సభ్యుల సంఖ్య 271నుంచి 243కి తగ్గుతుంది. ఎన్సీ, సీపీఎన్-ఎంసీ, జేఎస్పీఎన్లోని 15 మంది సభ్యుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది.
రాజకీయ సంక్షోభం..
గతేడాది డిసెంబర్ 20న నేపాల్ ప్రతినిధుల సభను ఓలీ సూచన మేరకు రాష్ట్రపతి విద్యా దేవి భండారీ రద్దు చేయడం వల్ల ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అనంతరం ఏప్రిల్ 30, మే 10 ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. ఓలీ, ప్రచండ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరి ఈ పరిస్థితులు తలెత్తాయి.
అయితే సభను అర్థాంతరంగా రద్దు చేయడాన్ని నేపాల్ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మళ్లీ పునరుద్ధరించింది. మే 10న జరిగిన విశ్వాస పరీక్షలో ఓలీ నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ ఓడిపోయింది. ఓలీకి అనుకూలంగా 93 ఓట్లు రాగా.. 124 మంది సభ్యులు వ్యతిరేకించారు.
ఇవీ చదవండి: