ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్, భారత్ వంటి దేశాల్లో వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 97 లక్షల 88వేలు దాటింది. మొత్తం 9 లక్షల 40 వేల 353 మంది మరణించారు. కరోనా కేసుల్లో అమెరికా టాప్‌లో ఉండగా.. భారత్, బ్రెజిల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
నేపాల్..
నేపాల్‌లో బుధవారం రికార్డు స్థాయిలో 1,539 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 58,327కు చేరింది. 1068 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 41,706కు చేరింది. ఒక్కరోజులో 8 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 379కి చేరింది.
పాకిస్థాన్..
పాకిస్థాన్‌లో 665 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,03,089కి చేరింది. 24 గంటల్లో నలుగురు చనిపోగా.. మరణాల సంఖ్య 6,393కు చేరింది. 2,90,760 మంది కోలుకున్నారు. 5,936 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా..571 మంది పరిస్థితి విషమంగా ఉంది.
సింగపూర్...
సింగపూర్‌లో 27 కొత్త కేసులు వచ్చాయి. ఇందులో ఆరుగురు భారత్ నుంచి వచ్చినట్లు ఆ దేశ వైద్య విభాగం వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య బుధవారం నాటికి 57,515కు చేరింది. ఇందులో 56,884 మంది పూర్తిగా కోలుకున్నారు.
వియత్నాం..
కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 1న షట్‌డౌన్ తర్వాత వియత్నాంలో మళ్లీ అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరించనున్నారు. ఇక్కడ నుంచి పలు ఆసియా దేశాలకు శుక్రవారం(సెప్టెంబర్ 18) నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఈ దేశంలో ఇప్పటివరకు 1,059 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
స్పెయిన్..
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి కొన్ని ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ దేశంలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. మొత్తం 30వేల మంది మరణించారు.
కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు..
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 67,89,877 | 2,00,280 |
బ్రెజిల్ | 43,84,299 | 1,33,207 |
రష్యా | 10,79,519 | 18,917 |
పెరు | 7,38,020 | 30,927 |
కొలంబియా | 7,28,590 | 23,288 |