Nail driven into woman's head: కచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే నదుటికి మేకు కొట్టుకోవాలని ఓ గర్భవతికి సూచించి, ఆమెను ప్రాణాపాయంలో పడేసిన నకిలీ బాబా కోసం పాకిస్థాన్‌లోని పెషావర్ నగర పోలీసులు గాలిస్తున్నారు.
అమ్మాయి అబ్బాయిగా మారిపోతుందని..
పెషావర్‌కు చెందిన బాధితురాలికి ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి. మరోసారి అమ్మాయే పుడుతుందని చాలా భయపడేది. మగబిడ్డ పుట్టకపోతే వదిలేస్తానని ఆమె భర్త బెదిరించడం ఇందుకు ప్రధాన కారణం.
నాలుగో కాన్పులోనూ అమ్మాయి పడుతుందన్న భయంతో క్షణమొక యుగంలా గడుపుతున్న ఆ మహిళ.. 'పరిష్కారం' కోసం తెగ వెతికింది. ఎవరో చెప్పగా.. ఓ 'బాబా' దగ్గరకు వెళ్లింది. ఆ నకిలీ బాబా ఓ అసాధారణమైన, ప్రాణాంతకమైన సలహా ఇచ్చాడు. నదుటిపై పదునైన మేకును దించితే.. గర్భంలో అమ్మాయి ఉన్నా అబ్బాయే పుడతాడని నమ్మబలికాడు. అతడు చెప్పినట్టే చేసింది ఆ మహిళ. తలలోకి రెండు అంగుళాల మేకు దిగగానే నొప్పితో విలవిల్లాడిపోయింది. ఆ మేకును బయటకు లాగేందుకు ఆమె కుటుంబసభ్యులు విఫలయత్నం చేశారు. హుటాహుటిన బాధితురాలిని పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించారు.
ఎక్స్‌రే వైరల్.. రంగంలోకి పోలీసులు..
న్యూరాలజిస్ట్ హైదర్ సులేమాన్ ఆమెకు చికిత్స చేశారు. ఆ మేకు పుర్రెలోకి చొచ్చుకెళ్లిందని, కానీ మెదడును తాకలేదని చెప్పారు. ఇలా ఎందుకు చేశారో ఆ మహిళ తనకు చెప్పగానే షాక్ అయ్యానని అన్నారు సులేమాన్. "మా ఇంటి దగ్గర్లో ఓ మహిళకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తే ఆడపిల్ల పుడుతుందని తేలింది. అయితే బాబా సూచన మేరకు ఆమె తలకు మేకు కొట్టించుకుంది. అప్పుడు ఆమెకు మగబిడ్డే పుట్టాడు" అని బాధితురాలు తనకు చెప్పినట్లు వెల్లడించారు సులేమాన్.
ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే.. మహిళ తలలో మేకు ఉన్న ఎక్స్‌రే ఫొటో వైరల్ అయింది. ఇది అధికారుల దృష్టికి వెళ్లగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఇంత జరిగినా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న కోణంలోనూ వైద్యులను ప్రశ్నించారు. పరారీలో ఉన్న నకిలీ బాబా కోసం గాలిస్తున్నారు.
తలకు మేకు బాధితురాలే కొట్టుకుందా లేక కుటుంబసభ్యుల్లో ఎవరైనా కొట్టారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు పోలీసులు. అయితే.. ఈ తతంగం అంతా ఆమె ఇంట్లోనే జరిగిందని వెల్లడించారు.
ఇదీ చూడండి: చలానా కోర్టులో కడతానన్నందుకు.. యువకుడిపై ట్రాఫిక్ పోలీస్ దాడి!