అగ్రరాజ్యంపై అణుదాడి హెచ్చరికలతో తరచూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా మరోమారు ఆయుధ పరీక్షల బాట పట్టింది. శక్తిమంతమైన క్షిపణులు, వ్యూహాత్మకంగా పనిచేసే ఆయుధాలను ప్రయోగించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఈ ప్రయోగం జరిగినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికాతో అణు చర్చలు విఫలమైన నేపథ్యంలో కొరియా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రెచ్చగొట్టేందుకే అణ్వాయుధాల ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. కానీ కొరియా మీడియా తన నివేదికల్లో ఇలాంటి పదాలను వినియోగించలేదు. ఐరాస ఆంక్షల పరిధిలో లేని సుదూర లక్ష్యాలను ఛేదించగల బహుళ రాకెట్ లాంచర్లను ప్రయోగించాలని కిమ్ ఆదేశించినట్లు మాత్రమే పేర్కొంది.
అణు చర్చలపై అమెరికా కార్యదర్శి మైక్ పాంపియో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉత్తర కొరియా సీనియర్ దౌత్యవేత్త విమర్శలు చేసిన కొన్ని రోజుల్లోనే ఈ ప్రయోగం జరగటం చర్చనీయాశమైంది. అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే అణు ప్రయోగాలు చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గత ఫిబ్రవరిలో ట్రంప్-కిమ్ సమావేశం విఫలమవటంతో అమెరికా-ఉత్తర కొరియా దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కానీ తాజా ప్యాంగ్యాంగ్లో జరుగుతున్న పరిణామాలకు విరుద్ధంగా.. చర్చల్లో పురోగతి ఉంటుందంటున్నారు ట్రంప్.
"ఉత్తర కొరియా ఆర్థిక సామర్థ్యాన్ని కిమ్ జోంగ్ ఉన్ గుర్తించారు. దానిలో జోక్యం చేసుకోవటం గానీ, ముగించటం గానీ కిమ్ ప్రయత్నించబోరు. కిమ్‌కు తెలుసు, నేను తనతో ఉన్నానని. నాకు ఇచ్చిన వాగ్ధానాన్ని తప్పటం కిమ్‌కు ఇష్టంలేదు. ఒప్పందం కుదురుతుంది." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
దక్షిణ కొరియా ఆందోళన
ఉత్తర కొరియా ఆయుధ ప్రయోగాలపై దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించేందుకు చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనగా పేర్కొంది. ఇలాంటి చర్యలను నిలిపేయాలని కోరింది.
ఇదీ చూడండి: గాజా రాకెట్ల దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం