మసీదుల్లో కాల్పులకు పాల్పడింది తమ దేశానికి చెందిన ఉగ్రవాదేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మోరిసన్ ధ్రువీకరించారు. న్యూజిలాండ్ పోలీసులు ఘటనా స్థలంలో దుండగులు అమర్చిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు పురుషులతో పాటు ఓ మహిళ ఉండటం గమనార్హం. వీరిని పోలీసులు విచారిస్తున్నారు.
పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. బాధితుల బంధువుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. అయితే దుండగులు పేలుడు పదార్థాలు అమర్చినందున ఎవరూ ఘటనా స్థలానికి రావద్దని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ జరిగింది..
శుక్రవారం మధ్యాహ్న సమయంలో ప్రార్థనల కోసం ప్రజలు మసీదుకు వచ్చారు. అదే అదునుగా దుండగుడులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో చాలా మంది మరణించినట్లు, క్షతగాత్రులైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంకా అధికారికంగా మృతుల సంఖ్య, ఇతర వివరాలు తెలియరాలేదు.
బంగ్లాదేశ్ క్రికెటర్లు సురక్షితం...
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు ప్రార్థన కోసం మసీదుకు వెళ్లారు. కాల్పుల సమయంలో వారు బస్సులో ఉండడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు.
ఈ భయానక సంఘటన వల్ల న్యూజిలాండ్, బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ రద్దు అయ్యింది.
అరుదైన ఘటనే..
న్యూజిలాండ్‌లో ఇలాంటి మారణహోమాలు జరగడం చాలా అరుదు. 1992లోనే గన్ లైసెన్స్ నిబంధనలు కఠినతరం చేసింది ప్రభుత్వం. అయితే 16 సంవత్సరాల వయస్సు దాటిన ఎవరైనా స్వీయరక్షణ కోసం గన్ లైసెన్స్ పొందేవీలుంది.
1994లో మతిస్థిమితంలేని ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. దాని తర్వాత ఇదే అంత పెద్ద కాల్పుల ఘటన.