ప్రపంచంపై కరోనా వైరస్(Corona virus) మళ్లీ పంజా విసురుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 7.23 లక్షల మందికి వైరస్ సోకింది. సుమారు 11 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. డెల్టా వేరియంట్లతో(Delta variant) వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 1.54 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. 967 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పడకలు చాలక ఆసుపత్రుల్లోని ఖాళీ ప్రాంతాల్లో టెంట్లు వేసి చికిత్స అందిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లకు చేరింది.
జపాన్‌లో ఎమర్జెన్సీ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది జపాన్ ప్రభుత్వం. సెప్టెంబర్ 12 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8 లోపు మూసివేయాలని, షాపింగ్ మాల్స్‌లో ప్రజలు గుమిగూడకుండా చూడాలని స్పష్టం చేసింది. గత వారంలో సగటున రోజుకు 20 వేల కొత్త కేసులు వచ్చాయి. టోక్యో, ఒకినావా సహా మరో 13 ప్రాంతాలకు ఎమర్జెన్సీ విస్తరించాలని నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక ఎమర్జెన్సీ ఉంటుంది.
సిడ్నీలో లాక్డౌన్ పొడిగింపు..
ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో సిడ్నీ మహానగరంలో లాక్డౌన్ పొడిగించారు. సెప్టెంబర్ చివరి వరకు ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. తప్పనిసరిగా మాస్క్ ధరించటం, కర్ఫ్యూ వంటి కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. గురువారం న్యూ సౌత్ వేల్స్లో 642 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజు 600లకు పైగా కేసులు వచ్చాయి. డెల్టా వేరియంట్ తొలి కేసు నమోదైన క్రమంలో జులై 26 నుంచి సిడ్నీలో లాక్డౌన్ విధించారు.
దక్షిణ కొరియాలో..
దక్షిణ కొరియాలో వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. కొత్త కేసులు గత రెండు రోజులుగా 2వేలకుపైగా నమోదయ్యాయి. మరోవైపు.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ వంటి ఆంక్షలు విధించినప్పటికీ కేసులు పెరగటం గమనార్హం. శుక్రవారం 2,052 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా 45 రోజులుగా వెయ్యికిపైగా కేసులు వచ్చాయి. ప్రయాణాలు పెరగటం సహా డెల్టే వేరియంట్ విజృంభణతోనే కేసులు పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న దేశాలు
- బ్రెజిల్- బ్రెజిల్లో కొత్తగా 36 వేల మందికి వైరస్ సోకింది. వెయ్యి మంది మరణించారు
- యూకే- యూకేలో 36వేల కొత్త కేసులు నమోదయ్యాయి. 113 మంది ప్రాణాలు కోల్పోయారు
- ఇరాన్- ఇరాన్లో కొత్తగా 31వేల మందికి పాజిటివ్‌గా తేలగా, 564 మంది మృతి చెందారు
- మెక్సికో- మెక్సికోలో 28 వేల కొత్త కేసులు వచ్చాయి. 940 మంది మరణించారు.
ఇదీ చూడండి: Delta Plus: రెండు డోసులు తీసుకున్నా.. 'డెల్టా ప్లస్'కు బలి