భారత్- చైనా మధ్య నెలకొన్న సమస్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బాధ్యత గల నేతలని.. ఇరు దేశాల మద్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వారికి ఉందని పేర్కొన్నారు. ఇతర దేశాలు ఇందులో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
"భారత్, చైనా సంబంధాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇరుగుపొరుగు దేశాల మధ్య ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ, భారత ప్రధాని, చైనా అధ్యక్షుడి వైఖరి నాకు తెలుసు. వారు బాధ్యతాయుతమైన వ్యక్తులు. ఇతరులను గౌరవంగా చూస్తారు. వారు ఎదుర్కొనే ఎలాంటి సమస్యనైనా పరిష్కారించుకుంటారని నా నమ్మకం. ఇందులో ఇతర ప్రాంతాలకు చెందిన శక్తులు తలదూర్చకపోవడం చాలా ముఖ్యం."
-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
చైనాతో సాన్నిహిత్యంపై
రష్యా-చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు భారత్‌పై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయన్న అంశంపై పుతిన్ స్పందించారు. భారత్-రష్యా మధ్య భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.
"భారతీయ స్నేహితులతో ఉన్నతస్థాయి సహకారం ఉండటాన్ని నేను స్వాగతిస్తాను. ఈ సంబంధాలు వ్యూహాత్మకమైనవి. అత్యుత్తమ సాంకేతికత, ఆర్థికం, ఎనర్జీ వంటి రంగాల్లో మంచి భాగస్వామ్యం ఉంది. రష్యా ఆయుధాల కొనుగోలు మాత్రమే కాకుండా.. రక్షణ రంగంలో భారత్‌తో మాకు లోతైన సంబంధాలు ఉన్నాయి. అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాంకేతికతల అభివృద్ధి విషయంలో రష్యాతో పనిచేస్తున్న ఏకైక భాగస్వామి భారత్."
-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
క్వాడ్‌పై
పరోక్షంగా క్వాడ్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు పుతిన్. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ 'క్వాడ్'ను ఆసియా నాటోగా అభివర్ణించడంపై స్పందించారు. ఏ దేశం ఎలాంటి కార్యక్రమాల్లో భాగం కావాలన్న విషయంపై తమకు సంబంధం లేదని అన్నారు. అయితే, ఏ భాగస్వామ్యమైనా ఇతరులకు వ్యతిరేకంగా ఏర్పడకూడదని చెప్పారు. భారత్, చైనాలతో రష్యా సంబంధాల మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవని అన్నారు.
"క్వాడ్‌లో మేం భాగస్వామ్యం కావడం లేదు. ఏ దేశం పాల్గొంటుందనే విషయంపై విశ్లేషణ చేయడం నా పని కాదు. సార్వభౌమాధికారం కలిగిన ప్రతి దేశానికి సొంతంగా ఈ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. తమ సంబంధాలను ఎవరితో, ఏ మేరకు అభివృద్ధి చేసుకోవాలనుకుంటారో వారే నిర్ణయం తీసుకుంటారు. ఏ దేశాల మధ్య భాగస్వామ్యమైనా ఇతరులకు వ్యతిరేకంగా ఉండకూడదనే నేను నమ్ముతాను."
-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
అమెరికా సంబంధాలపై
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జెనీవాలో జూన్ 16న జరగనున్న భేటీపై పుతిన్ మాట్లాడారు. ఈ సమావేశం నుంచి అత్యద్భుత ఫలితాలేవీ తాను ఆశించడం లేదని అన్నారు. 'నేను ఆ చర్యలు చేపట్టడం లేదు. మా సంబంధాలను క్షీణించేలా చేసిన చర్యల గురించి నేను మాట్లాడుతున్నా. ఆంక్షలు విధించించింది మేం కాదు. ప్రతిసారి అమెరికానే ఈ పని చేసింది. మా దేశం ఇంకా మనుగడలో ఉంది కాబట్టే ప్రతిసారి ఇలా చేసింది' అని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి- Vaccine: స్వల్ప సాయం.. పెద్ద వ్యూహం