మయన్మార్ కీలక నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు, నోబెల్ శాంతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి, అమెరికా ఖండించాయి. మయన్మార్ సైన్యం వెనక్కి తగ్గకుంటే ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు అమెరికా కృషి చేస్తుందని బైడెన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టవద్దని సూచించారు. మయన్మార్ సైన్యం చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా బైడెన్ వర్ణించారు.
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును తీవ్రంగా ఖండించారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు యూ విన్ మైంట్, ఇతర నేతలను నిర్బంధించటాన్ని తప్పుపట్టారు.
ఖండించిన ప్రపంచ దేశాలు..
మయన్మార్‌లో జరిగిన తాజా పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య ప్రక్రియకు మద్దతు తెలుపుతుందని పేర్కొంది.
మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని, గృహనిర్బంధంలో ఉన్న ఆంగ్సాన్సూకీ, ఇతర నేతలను వెంటనే సైన్యం విడుదల చేయాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది.
సైనిక చర్యను బంగ్లాదేశ్ కూడా ఖండించింది. ఆ దేశంలో వీలైనంత త్వరగా.. శాంతి, సుస్థిరత నెలకొనాలని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
మయన్మార్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది నేపాల్. నిర్బంధించిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఏడాది తర్వాత ఎన్నికలు..
దేశంలో ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని మయన్మార్ సైన్యం వెల్లడించింది. ఆ తర్వాతే ఎన్నికలు ఉంటాయని ఓ టీవీ ఛానల్‌కు తెలిపింది. సోమవారం.. కీలక నేతలను అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ ప్రకటన చేసింది.
ఇక మయన్మార్‌లో సైన్యాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్ సర్వాధికారాలు చెలాయించనున్నారు. నవంబర్ ఎన్నికల తర్వాత మయన్మార్ పార్లమెంటు సోమవారం తొలిసారి సమావేశంగా కానుండగా.. అదేరోజు సైన్యం తిరుగుబాటు చేయడం గమనార్హం.
ఉద్యమించండి: సూకీ
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలపాలని ఆంగ్ సాన్ సూకీ కోరినట్లు తెలిసింది. సైనిక చర్యతో దేశం తిరిగి నియంతృత్వంలోకి వెళ్తుందని ఓ ప్రకటనలో చెప్పారు సూకీ. దీనిని రాజ్యాంగ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు.
'' దేశ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి దీనిని అంగీకరించవద్దు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని హృదయపూర్వకంగా కోరుతున్నా.''
- ఆంగ్ సాన్ సూకీ
ఇంటర్నెట్ ఇబ్బందులు..
మయన్మార్‌లో సైనిక చర్య కారణంగా.. దేశంలో అత్యయిక స్థితి అమల్లో ఉంది. ఫలితంగా.. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలకు అంతరాయంతో బ్యాంకులు తాత్కాలికంగా మూతబడ్డాయి.
పలు చోట్ల ప్రధాన బ్యాంకుల ఏటీఎంలు కూడా పనిచేయట్లేదని అక్కడి వార్తాపత్రికలు నివేదించాయి.
టెలిఫోన్, అంతర్జాల సేవలు సైతం నిలిచిపోయాయి. టెలివిజన్ ప్రసారాలపై సైన్యం ఆంక్షలు విధించింది.
విమానప్రయాణాలు రద్దు..
మయన్మార్‌లో అన్ని విమాన ప్రయాణాలను రద్దు చేసినట్లు ఆ దేశ విమానయానశాఖ అధికారులు వెల్లడించారు. మయన్మార్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం సెక్యూరిటీ అలర్ట్‌ను కూడా జారీ చేసింది.
అసలేమైంది..?
మయన్మార్ పార్లమెంట్‌కు గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ 476 స్థానాలకు గానూ.. 396 స్థానాలు కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు చట్టసభ్యులు సోమవారం నేపిడాలో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని భావిస్తూ ఆ దేశం సైన్యం ఆంగ్‌సాన్ సూకీ సహా ఇతర కీలక నేతలను అదుపులోకి తీసుకొని గృహనిర్బంధం విధించింది. ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని మయన్మార్ సైన్యం వెల్లడించింది.
ఎప్పుడేం జరిగిందంటే..
1948: బ్రిటన్ వలస పాలన నుంచి మయన్మార్‌కు స్వాతంత్య్రం
1962: సైన్యం తిరుగుబాటు. 5 దశాబ్దాలకు పైగా కొనసాగిన నియంతృత్వ పాలన
1988: స్వదేశానికి సూకీ. సైన్యానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం
1989: ఆంగ్ సాన్ సూకీ గృహనిర్బంధం
1990: సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ పార్టీ భారీ విజయం. అధికారం అప్పగించేందుకు సైన్యం ససేమిరా.
2010: గృహనిర్బంధం నుంచి ఆంగ్ సాన్‌కు విముక్తి
2015: సాధారణ ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డీ విజయం. అయినా ఆమెకు అధ్యక్ష పదవిచ్చేందుకు సైన్యం నిరాకరణ. స్టేట్ కౌన్సిలర్‌గా ఉంటూ ప్రభుత్వాన్ని నడిపేందుకు అనుమతి.
2017: సైన్యం అవుట్‌పోస్టులపై తీవ్రవాదుల దాడులు. దీనికి స్పందిస్తూ రోహింగ్యా ముస్లింలపై సైన్యం చర్యలు. వేలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశం
2019: రోహింగ్యాల విషయంలో సైన్యం ఎలాంటి తప్పుచేయలేదంటూ అంతర్జాతీయ కోర్టులో సూకీ సమర్థన
2020: భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి ఎన్‌ఎల్‌డీకి అధికారం
2021: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సైన్యం తిరుగుబాటు. ఏడాదిపాటు అధికారం తమదేనంటూ ప్రకటన.
ఇదీ చూడండి: మయన్మార్ సైనిక చర్యపై ప్రపంచ దేశాల ఆందోళన