ఆస్ట్రేలియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మెల్బోర్న్ ఒకటి. ఇక్కడ సముద్రతీరంలో సీల్స్ కాలనీ ఉంది. రోజూ ఎంతో మంది సందర్శకులు అక్కడికి వస్తుంటారు. కొంతమంది చేపలు కూడా పడుతుంటారు. వారు పడేసిన ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, తీగలు, చెత్తా చెదారానికి కొన్ని సీల్స్ బలైపోతున్నాయి. దీనికితోడు ఏటా విస్తరిస్తున్న జనాభాతో పాటు నగరంలో చెత్తాచెదారం సైతం కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది.
ఈ వ్యర్థాలు ప్రమాదకరంగా మారి గాయాలపాలవుతున్న సీల్స్‌ను రక్షించేందుకు మెల్బోర్న్ మెరైన్ జూ బృందం తీవ్రంగా కృషిచేస్తోంది. వాటికి చికిత్సను అందిస్తోంది. పూర్తిగా దెబ్బతిన్న వాటిని జూకు తీసుకెళ్లి సర్జరీ చేసి మరీ వాటి బాగోగులు చూస్తున్నారు. వీళ్లకు పోర్ట్ ఫిలిప్ తీరంలో ఓ సీల్ పిల్ల తీవ్రంగా గాయపడి కనిపించింది.
"యుక్త వయస్సులో ఉన్న జంతువులకు ఇది పెరిగే దశ. కాబట్టి అవి త్వరగా బరువు పెరుగుతాయి. చుట్టూ చిక్కుకున్న తీగల నుంచి అవి తప్పించుకోలేవు. అలాగే మోనోఫిలమెంట్స్ చాలా దృఢంగా ఉండటం వల్ల అవి వాటి మెడని తెగేలా చెయ్యగలవు."
-మార్క్ కీనన్, మెరైన్ ప్రతిస్పందన బృందం సభ్యుడు
సముద్రంలో గాయాలపాలైన జీవరాసులకు సాయం అందించమని మెరైన్ జూ ప్రతిస్పందన బృందానికి గత ఏడాది 470 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ సారి అది 34 శాతం పెరిగింది.
మానవుల తప్పిదాల కారణంగా దెబ్బతింటున్న సీల్స్‌తో పాటు... బాతులు, హంసలు, తాబేళ్లు, తిమింగలాలు, పెంగ్విన్లు, డాల్ఫిన్లకు కూడా ఈ బృందం చికిత్స అందిస్తుంది.
మూగజీవాల ప్రాణాల విలువను గ్రహించి పర్యావరణ పరిరక్షణకు అంతా పాటుపడితే ప్రకృతి రమణీయతను కాపాడొచ్చు.