భద్రతా దళాలు ఉక్కుపాదం మోపినా.. మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఆదివారం సైన్యం కాల్పులు జరిపి 18 మందిని పొట్టనపెట్టుకున్నా.. ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. సోమవారం రోజూ వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు.
ప్రదర్శనలు, ఆందోళనలపై నిషేధం ఉన్నా..లెక్కచేయకుండా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. బౌద్ధ భిక్షువులు కూడా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. సైనిక ప్రభుత్వం వద్దు-ప్రజా ప్రభుత్వం కావాలన్న నినాదాలతో మయన్మార్ ప్రధాన నగరాలు మార్మోగుతున్నాయి. అంగ్ సాన్ సూచీ ప్లకార్డులు పట్టుకుని... చేతికి ఎర్ర రిబ్బెన్లు ధరించి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. భద్రతాదళాల దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక షీల్డ్‌లతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
పట్టువీడని సైనిక ప్రభుత్వం..
ప్రజా ఆందోళనలు రోజురోజుకు తీవ్రరూపు దాల్చుతున్నందున నిరసనకారులపై సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రదర్శనకారులను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు, సైనికులను మోహరింపజేసింది. జాతీయ భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. నిరసనకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించారు. మయన్మార్ ప్రధాన నగరాల్లో ఆందోళనకారులకు భద్రతాదళాలకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యాంగూన్, మాండలే, దవే, బాగో నగరాలలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఆదివారం దాదాపు 18 మంది మరణించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఈ మరణాలను సైనిక ప్రభుత్వం నిర్ధరించలేదు.
ఇదీ చదవండి:'మా నౌకపై దాడి చేయించింది ఇరానే'