దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలు మలేషియా దాకా వ్యాపించాయి. ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి ప్రాంతాలకే పరిమితమైంది. చైనా యుద్ధవిమానాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో మలేషియా కూడా ఫైటర్ జట్ విమానాలను రంగంలోకి దింపి వాటిని తరమాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఒక్కసారి దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన భూభాగానికి సుదూరంగా ఉన్న మలేషియా వద్ద సముద్ర జలాలు కూడా తనవే అని చైనా ప్రకటించుకోవడం వివాదానికి మూలకారణం అయ్యింది.
ఏమి జరిగింది..
మలేషియాలోని సార్వాక్ ప్రాంతంలో సముద్ర జలాలపై సోమవారం 16 చైనా యుద్ధవిమానాలు ప్రయాణించాయి. ఈ యుద్ధవిమానాలు వ్యూహాత్మక ఫార్మేషన్‌లో ప్రయాణించడం మలేషియాను మరింత కలవరపర్చింది. సార్వాక్‌కు 110 కిలోమీటర్ల దూరం (60నాటికల్‌మైళ్లు)లో 27,000 అడుగుల ఎత్తున ప్రయాణించాయి. బోర్నియో ద్వీపం నుంచి మలేషియా అధికారులు ఈ విమానాలతో కమ్యూనికేషన్‌లోకి వచ్చి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా పట్టించుకోకపోవడంతో మలేషియా వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలు లబౌన్ ఎయిర్‌బేస్ నుంచి గాల్లోకి ఎగిరాయి. మధ్యాహ్నం 1.33 సమయంలో వాటిని వెనక్కి వెళ్లిపొమ్మని సంకేతాలు పంపాయి. ఆ వచ్చిన విమానాల్లో ఇల్యూషన్ ii-76, షియాన్ వై20 రవాణా విమానాలు ఉన్నాయి. ఈ అంశాన్ని మలేషియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
చైనా దౌత్యవేత్తకు సమన్లు..
ఈ ఘటనను మలేషియా సార్వభౌమాధికారానికి బెదిరింపులుగా అభివర్ణించింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆ దేశంలోని చైనా రాయబారికి సమన్లు జారీ చేసింది. ‘‘ఏ దేశంతో అయినా మేము స్నేహపూర్వకంగా ఉన్నామంటే దానర్థం మా దేశ సార్వభౌమాధికారాన్ని వదులుకుంటామని కాదు’’ అని మలేషియా వ్యాఖ్యానించింది.
దీనిపై కౌలాలంపూర్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. అది చైనా వాయుసేన సాధనలో భాగంగా జరిగిందని పేర్కొంది. తాము అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడే గగనతలంలో ప్రయాణించామని.. ఏదేశ ప్రాదేశిక గగనతలంలోకి చొరబడలేదని సమర్థించుకొంది. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి మలేషియాలో స్నేహపూర్వక సంబంధాలు నెరపడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. గతేడాది కూడా చైనాకు చెందిన ఒక సర్వే నౌక మలేషియా జలాల్లో తిష్టవేసుకొంది. ఆ వివాదం చల్లారడానికి దాదాపు నెలరోజులు పట్టింది.
ఇదీ చదవండి: చైనా ఆగడాలపై భారత్‌కు వియత్నాం ఫిర్యాదు
ఇదీ చదవండి: 'ఉద్రిక్తతలు పెంచేందుకే చైనా క్షిపణి ప్రయోగాలు'
ఇటీవలే ఫిలిప్పీన్స్‌తో వివాదం..
మార్చి 7వ తేదీన వివాదాస్పద జూలియన్ ఫిలిప్పే ద్వీపం వద్దకు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలివచ్చాయి. చైనా చేపలవేట ఓడలు చిన్నసైజు యుద్ధనౌకలను తలపిస్తుంటాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతు ఉంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోనే ఈ ద్వీపం ఉంటుంది. అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనాతో స్నేహంగా ఉండేందుకు.. వీలైనంత ఉదాసీనంగా వ్యవహరించారు. మరోపక్క రక్షణ భాగస్వామిగా ఉన్న అమెరికాతో ఒప్పందాలను రద్దు చేసుకొనేందుకు కూడా డ్యుటెరెట్టి ఒక దశలో ప్రయత్నించారు. అయినా డ్రాగన్ మారకపోవడంతో ఫిలిప్పీన్స్ విసిగిపోయింది.
మే 3వ తేదీన ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ మంత్రి టియోడోరో లోక్సిన్ చైనాపై ట్విటర్లో విరుచుకుపడ్డారు. రాయలేని పదాలతో బూతులు అందుకొన్నారు. ఈ ట్వీట్ల పరంపర అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. దీనిపై చైనా స్పందిస్తూ.. కనీసం దౌత్య భాష వాడితే మేము స్పందిస్తామంటూ పేర్కొంది. అంతేకానీ ఆ నౌకలను వెనక్కి పిలవలేదు. గత వారం ఫిలిప్పీన్స్ మరోసారి దౌత్య నిరసన వ్యక్తం చేసింది. 2016లో డ్యుటెరెట్టి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇది చైనాకు వ్యతిరేకంగా చేపట్టిన 84వ దౌత్య నిరసన..! చైనా ముప్పును గ్రహించిన ఫిలిప్పీన్స్ ఈ ప్రాంతంలో గస్తీని విపరీతంగా పెంచింది. మార్చి 1 నుంచి మే 25 వరకు స్పార్ట్‌లీ ద్వీపాల వద్దకు 53సార్లు గస్తీ దళాలను పంపింది.
సముద్రాన్నే మింగేంత దాహం..!
దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్, బ్రునై, మలేషియా వంటి దేశాలున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి. తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల దూరం వరకు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ కిందకు వెళతాయి. అంటే సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ 200 నాటికల్ మైళ్ల దూరం ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆ దేశానికి దక్కుతుంది. ఈ లెక్కన చైనాకు తనది చెప్పుకొనే సముద్రంలో అతి తక్కువ భాగమే దక్కుతుంది. కానీ డ్రాగన్ దక్షిణ చైనా సముద్రాన్నే మింగేయాలనుకుంటోంది. ఇక్కడ భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. దీంతో వీటిని సొంతం చేసుకోవడం కోసం ఇక్కడి చాలా దీవులు తనవే అని చెబుతోంది. వీటిల్లో స్పార్ట్‌లీ దీవులు కీలకమైనవి. వీటిని దక్కించుకోవడానికి ఒక దీవిని కృత్రిమంగా తయారు చేసి అక్కడ తన యుద్ధవిమానాలను మోహరించింది. అంతేకాదు ఈ మార్గంలో ఏటా మూడు ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకులను రవాణా చేస్తారు.
ఇవీ చదవండి: డ్రాగన్ దుందుడుకు చర్యలపై క్వాడ్ కార్యాచరణ