కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వుహాన్ నగరంలో లాక్డౌన్ ఎత్తివేసింది చైనా ప్రభుత్వం. పూర్తిస్థాయిలో ఆంక్షలను సడలించింది. 76 రోజుల నిర్బంధం నుంచి 11 మిలియన్ల వుహాన్వాసులకు విముక్తి లభించింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అనుమతి లభించటం వల్ల అక్కడి ప్రజల్లో ఆనందానికి అవధులు లేవు. వుహాన్ నగరానికి ఇది ఒక గొప్ప రోజుగా భావిస్తున్నారు.
అయితే.. తాజాగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ ఎత్తివేయటం వల్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వెయ్యి కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కాంతులమయం..
లాక్డౌన్ ఎత్తివేసిన క్రమంలో వందల మంది ప్రజలు వీధుల్లోకి చేరి సంబరాలు చేసుకున్నారు. నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. 'వుహాన్ లెట్స్ గో' అంటూ నినాదాలు చేస్తూ.. వీధుల్లో ర్యాలీలు తీశారు ప్రజలు. కరోనా వైరస్‌పై పోరులో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా.. యాంగేట్జ్ నదికి ఇరువైపుల ఉన్న ఆకాశహర్మ్యాలు, ఏడు వంతెనలను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించి లైట్ షో నిర్వహించారు. వైద్యులు, పోలీసులు, ఇతర విభాగాల సిబ్బంది చిత్రాలను భవంతులపై ప్రదర్శించి కృతజ్ఞతలు తెలిపారు.
టోల్గేట్ల వద్ద రద్దీ..
రోడ్డు, రైలు, వాయు వార్గాల్లో ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది చైనా. ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రం ఉన్నవారు ప్రయాణాలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ చర్యతో వేల మంది ప్రజలు ఇతర నగరాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్గేట్ల వద్ద రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర కార్లు నిలిచిపోయాయి. ఉత్తర వుహాన్‌లోని ఫుహే టోల్గేట్ వద్ద అర్ధరాత్రి బారికేడ్లను తొలగించి రాకపోకలకు అనుమతించారు.
వుహాన్ నుంచి జింగ్జౌ నగరానికి వెళ్లాల్సిన తొలి రైలు ఉదయం 6 గంటలకు హాంకౌ స్టేషన్ నుంచి బయలుదేరింది. హుబే వెలుపలి ప్రాంతాలకు మొత్తం 276 రైళ్లు నడపనున్నారు. వుహాన్ విమానాశ్రయం నుంచి స్వదేశీ విమానాలను ప్రారంభించారు. తొలి విమానంలో 48 మంది ప్రయాణించారు. సుమారు 200 విహాంగాలను నడపనున్నట్లు సమాచారం.
9 రాష్ట్రాల్లో తరగతుల ప్రారంభం..
ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉన్న విద్యార్థుల కోసం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, ప్రాంతాల్లో తరగతులను ప్రారంభించింది ప్రభుత్వం. హెనాన్ రాష్ట్రంలో తొలి రోజు సుమారు 6.90 లక్షల మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు అధికారులు. ప్రత్యేక బస్సులు నడపటం, పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం పాటించటం, విద్యార్థులు మాస్కులు ధరించేలా చూస్తున్నారు. ఈ దిశగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా భయాలు బేఖాతరు- అమెరికాలో యథావిధిగా ఎన్నికలు