కిమ్ జోంగ్ ఉన్... తన ప్రవర్తనతో నిత్యం వార్తల్లో ఉంటారు ఈ ఉత్తరకొరియా అధ్యక్షుడు. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలనే వణికిస్తాయి. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్తర కొరియా అధికారులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు కిమ్. దేశంలోకి వైరస్ ప్రవేసిస్తే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉత్తర కొరియాలో ఆరోగ్య ప్రమాణాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే తమ సరిహద్దులను మూసివేశారు కిమ్.
వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రజల రక్షణ చర్యల్లో కీలక వ్యవహారమని కొరియా అధికార వర్కింగ్ కమిటీ సమావేశంలో కిమ్ అన్నారు. వేగంగా వ్యాపిస్తోన్న వైరస్ తమ దేశంలో అడుగుపెడితే.. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో అధికారులకు వివరించారు.
కరోనాతో పోరులో అవినీతికి పాల్పడినట్టు తెలియడం వల్ల ఇద్దరు సీనియర్ అధికారులతో సహా పార్టీకి చెందిన ఓ విభాగాన్ని తొలగించారు కిమ్.
చైనా-కొరియా...
ప్రపంచవ్యాప్తంగా 2,800 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 84 వేల మందికి ఈ వైరస్ సోకింది. ఈ కేసులన్నీ అధిక భాగం చైనాలోనే ఉన్నాయి.
అయితే చైనాకు సమీపంలోని ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. దీనికి కారణం... ఆ దేశం ఇప్పటికే అంతర్జాతీయ రైల్వే, విమాన సేవలను నిలిపివేసి జాగ్రత్తలు చేపట్టింది. వందలాది మంది సందర్శకులను నిర్బంధంలో ఉంచింది.
ఇదీ చదవండి: కరోనాతో ప్రపంచం విలవిల.. 57 దేశాలకు వ్యాప్తి