Kim Jong Un latest meeting: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో.. అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీకి చెందిన ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. గతంలో ఇదే వేదికపై.. అమెరికాతో బంధం, దేశ అణ్వస్త్ర కార్యక్రమాలపై కిమ్ కీలక ప్రకటనలు చేశారు. ఈసారి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధ్యక్షుడిగా కిమ్.. తన 10ఏళ్ల పాలనను ఇటీవలే పూర్తి చేసుకున్న తరుణంలో భేటీ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివిధ ప్రాజెక్టులను సమీక్షించేందుకు, కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో నూతన విధానాలపై చర్చించేందుకు, అమెరికాతో నెలకొన్న ప్రతిష్ఠంభనపై సమాలోచనలు చేసేందుకు.. ఈ ప్లీనర్ సమావేశం సోమవారం ప్రారంభమైంది. భేటీ ముగింపు తేదీపై స్పష్టత లేదు. 2019లో జరిగిన ప్లీనరీ సమావేశం.. నాలుగు రోజుల పాటు సాగింది.
దేశ విధానాలను రూపొందించడంలో ఈ ప్లీనరీది కీలక పాత్ర! తాజా సమావేశంలో పాల్గొన్న సభ్యులు.. పలు అజెండాలను ఆమోదించి, వాటిపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఉత్తర కొరియా అధికార మీడియా విడుదల చేసింది.
ఇదీ చూడండి:- కిమ్ దశాబ్ద పాలన- హత్యలు, ఆకలి కేకలు, అణచివేతలు