ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త ప్రీమియర్ నియామకం చేపట్టారు. ప్రస్తుతం ప్రీమియర్‌గా ఉన్న కిమ్ జే ర్యోంగ్ స్థానంలో కిమ్ టోక్ హన్‌ను నియమించారు. హన్ ఇప్పటి వరకు ఆ దేశ పార్లమెంటరీ బడ్జెట్ కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఇటీవల నిర్వహించిన అధికార వర్కర్స్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నియామకం జరిగిందని.. ఆ దేశ అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
దేశం ప్రస్తుతం కొవిడ్-19, అనూహ్యంగా సంభవించిన వరదల రూపంలో రెండు విపత్తులను ఒకేసారి ఎదుర్కొంటోందని ఈ సమావేశంలో కిమ్ అన్నారు. అయితే వీటి నుంచి సమర్థంగా బయట పడాలంటూ ఆయన తన అధికారులకు పిలుపునిచ్చారు.
ఉత్తర కొరియాలో ఇటీవల సంభవించిన వరదల్లో 39,296 ఎకరాల మేర పంటపొలాలు దెబ్బతినగా.. 16,680 గృహాలు, 630 ప్రభుత్వ భవనాలు ముంపునకు గురయ్యాయి.
అయితే ఈ విపత్కర పరిస్థితిలో తమకు ఇతరుల సహాయం అవసరం లేదని పరోక్షంగా దక్షణ కొరియాను ఉద్దేశించి కిమ్ స్పష్టం చేశారు. మరో వైపు.. రాజకీయ ఉద్దేశాలతో కాకుండా మానవతా దృక్పధంతో ఆపన్న హస్తం అందించటానికి తాము సిద్ధమని, గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని దక్షణ కొరియా ప్రకటించడం గమనార్హం.
ఇదీ చూడండి:'ఆహార పదార్థాలతో కరోనా వ్యాపించదు'