జపాన్‌లో జనన రేటు తగ్గిపోవటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. దీంతో జననరేటును పెంచే దిశగా ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని రూపొందించింది. యువతీయువకులు పెళ్లి చేసుకుంటే జననాల రేటు పెరుగుతుందని భావించిన జపాన్, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల యెన్‌లు (రూ. 4లక్షలకు పైగా) నగదు బహుమతి ఇస్తామని వెల్లడించింది. ఈ ప్రోత్సాహకం అందాలంటే వధువు, వరుడు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. 40ఏళ్ల వయసు మించకుండా, వార్షికాదాయం 5.4 లక్షల యెన్లకు తక్కువగా ఉన్నవారే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జపాన్‌లో జననాల రేటు దారుణంగా పడిపోతోంది. గతేడాది జపాన్‌లో కేవలం 8.65 లక్షల మందే జన్మించారు. ఇలా జనన రేటు తగ్గిపోవడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంతో వివాహాలు పెరిగి.. ఆయా జంటలు పిల్లల్ని కంటే.. దేశంలో మళ్లీ జననాల రేటు పెరుగుతుందన్నది అక్కడి ప్రభుత్వ ఆలోచన.