టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో మాస్కులు ఓ పరిధి వరకే వైరస్‌ను అడ్డుకుంటాయని వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఓ ప్రత్యేక ఛాంబర్‌లో మనుషుల తలలను పోలిన బొమ్మ నిర్మాణాలను ఉంచారు. ఒక తలకు ఎదురుగా మరొకటి ఉంచి ఒక దానికి మాస్కు కట్టారు. ఎదురుగా ఉండే బొమ్మ నుంచి వైరస్ వచ్చేలా ఏర్పాటు చేశారు. మాస్కు లేని దాని కంటే కాటన్ మాస్కు ధరించటం వల్ల 40 శాతం వైరస్‌ను అడ్డుకున్నట్లు గుర్తించారు. ఎన్95 మాస్కులు అయితే 90 శాతం వరకూ వైరస్‌ను అడ్డుకున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయినా కొన్ని వైరస్ కణాలు మాస్కు నుంచి లోనికి ప్రవేశించినట్లు అధ్యయనంలో తేలింది.
ఈ క్రమంలో మాస్కులు కట్టిన బొమ్మ తల నోటి భాగం నుంచి వైరస్‌ను బయటికి వచ్చేలా చేయగా మాస్కు 50 శాతం వరకూ వైరస్‌ను అడ్డుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ బారిన పడే వ్యక్తికి, వైరస్‌ను వ్యాప్తి చేసే వ్యక్తికి మధ్య మాస్కు ధరించటం గొప్ప ప్రభావం చూపుతోందని బుధవారం ప్రచురితమైన ఈ అధ్యయనం వివరిస్తోంది. దీంతో పాటు జపాన్‌కు మరో శాస్ర్తవేత్తల బృందం గాలిలో వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేశారు. సూపర్‌కంప్యూటర్ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా తేమ శాతం ఉన్న వాతావరణంలో వైరస్ కణాలు విచ్ఛిన్నం అయినట్లు విశ్లేషించారు.