నిస్సాన్ సంస్థలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని నాలుగు కేసులు ఎదుర్కొంటొన్న ఆ సంస్థ మాజీ సీఈఓ కార్లోస్ ఘోస్న్‌కు ఊరట లభించింది. 4.5 మిలియన్ డాలర్ల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది టోక్యో జిల్లా కోర్టు. నేడు నిర్బంధ కేంద్రం నుంచి విడుదల కానున్నారు.
ఆర్థిక అవకతవకల ఆరోపణలు..
కార్లోస్ ఘోస్న్ గతంలో నిస్సాన్, రెనో, మిత్సుబిషీ మోటార్స్‌ల ఉమ్మడి సంస్థకు సీఈఓగా ఉన్నారు. ఆయన సీఈఓగా ఉన్నప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒమన్‌లో డీలర్షిప్ కోసం సుమారు 5 మిలియన్ డాలర్లు నగదు నిస్సాన్ సంస్థ నుంచి బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభంలో వ్యక్తిగతంగా నష్టపోయిన నగదును సంస్థ నష్టాలుగా చూపించారని మరో రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మొదటిసారిగా నవంబర్ 2018లో ఆయన్ను అరెస్టు చేశారు. ఫలితంగా సీఈఓ పదవి నుంచి ఘోస్న్ను తప్పించింది ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్.