మధ్య ఆసియా దేశమైన ఇజ్రాయెల్లో గత కొన్ని వారాలుగా రాజకీయ సంక్షోభం నెలకొంది. సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో 120 స్థానాలున్న పార్లమెంట్లో ప్రధాన పార్టీలైన లికుడ్, 'సెంట్రిస్ట్ బ్లూ'కు స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా.. ప్రస్తుత ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహును తొలుత ఆహ్వానించారు అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్. అయితే నెతన్యాహు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు.
ఈ తరుణంలో ప్రతిపక్ష నేత బెన్ని గ్లంట్జ్ను ప్రభుత్వ ఏర్పాటుకై 28 రోజుల ముందే ఆహ్వానించారు రూవెన్. ఇందుకు బెన్నీకిచ్చిన గడువు బుధవారం అర్థరాత్రితో తీరిపోనుంది. ఈ నేపథ్యంలో ఒకే సంవత్సరంలో మూడోసారి సాధారణ ఎన్నికల నిర్వహణకు విముఖత వ్యక్తం చేస్తూ పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నిస్తున్నారు మాజీ ఆర్మీ అధికారి అయిన గంట్జ్.
పార్టీ | బలం |
బ్లూ అండ్ వైట్(గాంట్జ్) | 33 |
లికుడ్(నెతన్యాహు) | 32 |
జాయింట్ లిస్ట్(అరబ్) | 13 |
షాస్ | 9 |
ఇజ్రాయిల్ బీటెను | 7 |
యమీనా | 7 |
లేబర్-గెషర్ | 6 |
డెమొక్రాటిక్ యూనియన్ | 5 |
అరబ్పై వైఖరేమిటో..
గంట్జ్ ప్రధానంగా అరబ్ దేశాల మద్దతుపై ఆధారపడుతున్నారు. అయితే గతవారం ఇస్లామిక్ స్టేట్, ఇజ్రాయిల్ బృందాల మధ్య ఘర్షణ వాతారణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ విధమైన పాలనా విధానాన్ని గంట్జ్ అవలంబిస్తారనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కీలకంగా లీబర్మాన్..
జాతీయవాద ఇజ్రాయెల్ బీటెను పార్టీనేత ఎవిగ్డార్ లీబర్మాన్ను తమతో కలిసిరావాలని గంట్జ్ ఆహ్వానిస్తున్నారు. అయితే లీబర్మాన్.. గంట్జ్తో కలిసినా వారికి మరో 13 సీట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం అంతమంది సభ్యుల మద్దతు కావాలంటే అరబ్ పార్టీలను సంకీర్ణంలో చేర్చుకోవాలసి ఉంటుంది.
అయితే లీబర్మాన్.. అరబ్ పార్టీతో కలిసేందుకు ఎంతమాత్రం సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో ఈ చర్చలకు ముగింపు పలికేందుకు నేటి మధ్యాహ్నం 12 గంటలవరకు గడువు విధించారు. ఒకవేళ చర్చ ముగింపునకు రాకపోతే తనదారి.. తాను చూసుకుంటానని లీబర్మాన్ వెల్లడించారు.
ఇదీ చూడండి: కార్పొరేట్ సామాజిక బాధ్యత మరచిన పెద్దలు