11 లక్షలకు పైగా కేసులతో ప్రపంచంపై పంజా విసురుతున్న కొవిడ్-19.. ఆసియాలోనూ ప్రబలుతోంది. భూగోళంపై సగానికిపైగా జనాభా లాక్డౌన్లో కాలం వెళ్లదీస్తున్నారు. వివిధ దేశాల్లో ఉన్న ఆంక్షల కారణంగా పలువురు మహిళలు ఆసాధారణ పరిస్థితుల్లో పిల్లలకు జన్మనిస్తున్నారు.
హాంకాంగ్, చైనా వంటి దేశాల్లో వైరస్ సోకకుండా అక్కడి ప్రభుత్వాలు అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. మెటర్నిటీ వార్డులకు గర్భిణిల భర్తలను సైతం ప్రభుత్వాస్పత్రులు అనుమతించడం లేదు. దీంతో ప్రసవవేదనతో పాటు మానసిక క్షోభనూ అనుభవిస్తున్నారు అక్కడి మహిళలు.
హాంకాంగ్‌కు చెందిన జామీ ఛుయ్ ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గర్భిణిగా 9 నెలల సమయం ఏదో ఒక కారణంతో నిర్బంధంలో గడుపుతున్నారు. అప్పట్లో హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల నిరసనల కారణంగా ఇంట్లోనే ఉన్న జామీ.. ప్రస్తుతం కరోనా కారణంగా ఇతరులతో కలవకుండా దూరం పాటిస్తున్నారు.
"సందర్శకులను అనుమతించడానికి ప్రభుత్వ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఇది చాలా ఒత్తిడి కలిగించే అంశం. నేను ఒంటరిగానే పోరాడాలి. నాకు ఆందోళనగా ఉంది. కానీ మేం ఇంకేం చేయగలం. గర్భవతిగా ఉన్న సమయం మొత్తం ఇంట్లోనే ఉన్నాను."-జామీ ఛుయ్
నిజానికి ప్రసవ సమయంలో గర్భిణికి తోడు లేకుండా ఆంక్షలు విధించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు విరుద్ధం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల పేద మధ్యతరగతి వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవానికి దాదాపు లక్ష హాంకాంగ్ డాలర్లు ఖర్చవుతాయి. ఇక్కడికి కుటుంబసభ్యులు గానీ, గర్భిణి భర్తను గానీ వెంట తీసుకెళ్లొచ్చు. కానీ అంత పెద్ద మొత్తం ఖర్చు చేయలేనివారికి మాత్రం ప్రభుత్వాస్పత్రులే దిక్కవుతున్నాయి.
గర్భిణికి నష్టం
హాంకాంగ్ ప్రభుత్వాస్పత్రుల తీరు వల్ల గర్భిణులకు నష్టం కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని వైద్య పరిశోధకురాలు క్రిస్టినా కిమోంట్ తెలిపారు.
"ఇప్పటికే తమ శిశువు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నవారికి ఇలాంటివి మరింత ఒత్తిడికి గురిచేస్తాయి. ఒత్తిడిలో ఉంటే సాధారణ పనులు చేయడానికి కూడా శరీరం నిరాకరిస్తుంది. అనవసర శస్త్రచికిత్సలకు దారితీస్తుంది."-క్రిస్టినా కిమోంట్, పరిశోధకురాలు
కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు.. మెటర్నిటీ వార్డులను సైతం వైరస్ బాధితులకోసం ఉపయోగిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి పెరిగిన తర్వాత.. మెటర్నిటీ యూనిట్లలో సిబ్బంది కొరత అధికమైనట్లు బ్రిటన్ ఆసుపత్రులు చెబుతున్నాయి. వైరస్ నుంచి తమను తాము కాపాడుకునే కిట్లు వైద్యులకు అందుబాటులో లేకపోవడం కూడా గర్భిణిల పాలిట శాపంగా మారింది.
పలు దేశాల్లో ఇప్పటికీ గర్భిణి వెంట భాగస్వామి తోడు రావడానికి అనుమతిస్తున్నారు. అయితే వైరస్ కేసుల పెరుగుదలలో తేడాలు ఉంటున్న కారణంగా నిబంధనలు ఎప్పటికప్పుడు మార్చుతున్నారు.
శిశువులకు వైరస్
మరోవైపు గర్భిణుల నుంచి శిశువులకు కరోనా సోకే విషయమై చైనాలోని వుహాన్‌లో 33 మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. కొన్ని అసాధారణ సందర్భాల్లో వైరస్ తల్లి నుంచి శిశువుకు సోకే అవకాశం ఉందని తేల్చారు. ఈ 33 మంది మహిళలలో ముగ్గురు శిశువులకు వైరస్ సోకినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: 'ఊపిరి పీల్చినా కరోనా వచ్చే ప్రమాదం!'