ఇరాన్ అధీనంలో ఉన్న ఎంటీ రియా నౌకలోని 9 మంది భారతీయులను విడుదల చేసింది ఆ దేశం. ఇరాన్ సీజ్ చేసిన ఈ నౌకలో 12 మంది భారతీయులు ఉన్నారు.
అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు చమురు ట్యాంకులను స్వాధీనం చేసుకుంది ఇరాన్. అందులో ఎంటీ రియా, బ్రిటన్కు చెందిన చమురు ట్యాంకర్ స్టెనా ఇమ్పెరో ఉన్నాయి. బ్రిటన్ ట్యాంకర్ను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ రెండు ట్యాంకుల్లోని సిబ్బందిలో మొత్తం 30 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం 9 మందిని విడుదల చేయగా... ఇంకా 21 మంది ఇరాన్ అధీనంలోనే ఉన్నారు.
బ్రిటన్ ట్యాంకర్లోని 18 మంది, ఎంటీ రియాలోని ముగ్గురు భారతీయులను సురక్షితంగా విడిపించేందుకు భారత్ చర్యలు చేపట్టిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయమై ఇరాన్ అధికారులను భారత రాయబారి కార్యాలయం సంప్రదించినట్లు తెలిపింది.
బ్రిటన్ అధీనంలో 24 మంది
స్పానిష్ తీరంలో బ్రిటన్ సముద్ర, జిబ్రాల్టర్ పోలీసులు ఇరానియన్ చమురు ట్యాంకర్ 'గ్రేస్-1' నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఈ నౌకలో ఉన్న 24 మంది భారతీయులు బ్రిటన్ అధీనంలో ఉన్నారు. వారిని భారత అధికారులు కలిసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత సిబ్బందిని విడిపించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: ఆపరేషన్ విజయ్: కార్గిల్ పరాక్రమానికి 20 ఏళ్లు