ఇండోనేసియా వరద బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 40,000 మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గల్లంతైన వారి కోసం విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసింది.
భారీ వరదల కారణంగా దేశ రాజధాని జకార్తా నీట మునిగింది. విద్యుత్తు లేక అంధకారం అలుముకుంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.