ఇండో-పసిఫిక్ దేశాల మధ్య సహకారం ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలుకుతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. క్వాడ్ దేశాల సత్సంబంధాలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో క్వాడ్‌కు మద్దతిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఫ్రెంచ్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు జైశంకర్. క్వాడ్‌ను 'ఆసియా నాటో'గా అభివర్ణించడాన్ని తప్పు పట్టారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్రొవ్ గత వారం ఓ మీడియో సమావేశంలో క్వాడ్‌ను ఉద్దేశిస్తూ ఆ కూటమిని 'ఆసియా నాటో' అని అన్నారు.
"భారత్ అభివృద్ధే లక్ష్యంగా వివిధ దేశాలతో ఐక్యంగా ఉంటున్నాం. ఇదే దాని ముఖ్య ఉద్దేశం. దీని వల్ల ప్రపంచ దేశాలకూ ఉపయోగం ఉంటుంది. 'ఆసియా నాటో' అని అభివర్ణిస్తూ కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారు."
--జైశంకర్, భారత విదేశాంగ మంత్రి.
రష్యా రాయబారి సికోలే కుదాషేవ్.. పాశ్యాత్య దేశాల ఇండో-పసిఫిక్ కూటమి ప్రమాదకరమని అన్నారని, అది ప్రచ్ఛన్న యుద్దానికి తావిస్తుందని చెప్పినట్లు జయశంకర్ గుర్తు చేశారు. అయితే.. భారత్ దృష్టిలో ఇండో-పసిఫిక్ కూటమి ఉద్దేశం వేరని ఆయన వెల్లడించారు. క్వాడ్ దేశాలతో.. కొవిడ్ వ్యాక్సిన్లు, వాతావరణ మార్పు, సాంకేతకత, తీవ్రవాదాన్ని నిరోధించడం మొదలైన అంశాల గురించి చర్చిస్తామని పేర్కొన్నారు. దీన్ని బట్టి భారత్ ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవాలని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:టీకా రెండో డోసు తీసుకున్నా: పుతిన్