ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ, ప్రాదేశిక సమగ్రతనే తాము కోరుకుంటున్నామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ స్పష్టం చేసింది. ఆసియాన్ దేశాలకు ఈ ప్రాతం.. కేంద్ర స్థానంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పింది. సరిహద్దుల్లో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సహకారం అత్యంత కీలకం అని తెలిపింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి ఆధ్వర్యంలో ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సహకారంపై నిర్వహించిన ఓ సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ అభిప్రాయపడ్డారు.
"ఇండో పసిఫిక్ ప్రాతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ, ప్రాదేశిక సమగ్రతను భారత్ కోరుకుంటోంది. ప్రాదేశిక లేదా రాజకీయ వివాదాలకు మాత్రమే సమకాలీన భద్రతా సవాళ్లు పరిమితం కావు. అవి సరిహద్దులను దాటి విస్తరిస్తాయి. నేటి ఆధునిక కాలంలో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణా, వ్యవస్థీకృత నేరాలు వంటివి పెరుగుతున్నాయి. కొత్త సాంకేతికతో ఎదురయ్యే భద్రతా సమస్యలనూ విస్మరించలేము. ఇలాంటి విభిన్నమైన సవాళ్లను ఎదుర్కోవాలంటే మనకు సరిహద్దులో సహకారం తప్పనిసరిగా కావాలి."
-ఎస్.జైశంకర్, విదేశాంగ మంత్రి
75 ఏళ్లుగా భారత్‌కు ఐరాస చక్కని సహకారం అందించిందని జైశంకర్ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఈ సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆసియా దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడంలో భారత విదేశాంగ విధానంలో అత్యంత కీలకమైన అంశమని స్పష్టం చేశారు. ఆఫ్రికా సమాఖ్య, ఐరోపా సమాఖ్య దేశాలతోనూ భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత్‌తోనే చైనా కట్టడి దిశగా అమెరికా!