ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతాపం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 90 లక్షల మందికి పైగా కరోనా సోకింది. మరణాలు 4 లక్షల 71 వేలు దాటాయి. 48 లక్షల మందికిపైగా కోలుకున్నారు.
రష్యాలో కొత్తగా 7,600 కేసులు..
కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రష్యాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా మరో 7,600 మంది వైరస్ బారినపడ్డారు. 95 మంది వైరస్ సోకి మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 8,206కు చేరింది. ఇప్పటివరకు 5,92,280 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.
పాక్‌లో తీవ్రం..
పాకిస్థాన్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 4,471 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 1,81,088కి చేరింది. మరో 89 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 3,590 మంది వైరస్‌కు బలయ్యారు.
10 వేలకు చేరువలో..
నేపాల్‌ను కరోనా వైరస్ వణికిస్తోంది. గడచిన 24 గంటల్లో 535 మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో వైరస్ కేసులు 10 వేలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 9,561 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో కరోనాతో 23 మంది మరణించారు.
న్యూజిలాండ్‌లో మరో ఇద్దరికి..
న్యూజిలాండ్‌లో తాజాగా రెండు కరోనా కేసులు బయటపడినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు భారత సంతతి వ్యక్తిగా గుర్తించారు. దేశంలో కరోనా కేసులు లేవని ఆ దేశ ప్రధాని ప్రకటించిన తర్వాత మొత్తం తొమ్మిది మంది వైరస్ బారినపడ్డారు.
సింగపూర్‌లో 26 మంది..
సింగపూర్‌లో కొత్తగా 218 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 217 మంది విదేశీ వలస కార్మికులని ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:చైనా సైన్యంపై గెలుపు సులువే- ఇవే కారణాలు...