కశ్మీర్ అంశాన్ని ప్రపంచదేశాల ఎదుట తప్పుగా చిత్రీకరించాలనుకున్న పాకిస్థాన్ దురాలోచనను మరోసారి భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన యూనిసెఫ్ కార్యక్రమం వేదికగా... కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించింది పాక్. దీనిపై ఘాటుగా స్పందించిన భారత్.. పొరుగు దేశానికి చెందిన మైనారిటీ హక్కుల ఉల్లంఘన రికార్డులను బయటపెట్టింది.
యూనిసెఫ్ సౌత్ ఏషియన్ పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ ఆన్ చిల్డ్రన్ రైట్స్ కన్వెన్షన్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి.. కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్యవహారమని పాక్కు తేల్చిచెప్పారు.
చిన్నారుల హక్కులకు సంబంధించిన కార్యక్రమంలో కశ్మీర్ విషయాన్ని పాక్ లేవనెత్తడం బాధాకరమని గొగొయి తెలిపారు.
పాక్ భంగపాటుకు గురి కావడం ఈ వారంలో ఇప్పటికే ఇది రెండోసారి. మాల్దీవుల్లో జరిగిన దక్షిణాసియా స్పీకర్ల సదస్సు వేదికగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది పాకిస్థాన్. దాయాది దేశ ప్రతినిధి బృందం వాదనలు పట్టించుకోని సదస్సు... జమ్ముకశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని వెల్లడించింది. తీర్మానానికి భారత్ చేసిన సవరణ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఇదీ చూడండి:- కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్యలకు పాక్ విశ్వప్రయత్నాలు