నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలితో సమావేశమయ్యారు భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలిపాయి పొరుగుదేశ సైనికవర్గాలు. కాఠ్మాండూలోని ప్రధాని ఓలి అధికారిక నివాసంలో ఇరువురు భేటీ అయినట్లు వెల్లడించాయి.
అంతకు ముందు ఎవరెస్ట్ శిఖర ప్రవేశ ద్వారమైన సియాంగ్బోచే విమానాశ్రయంలో కొద్ది సేపు గడిపారు నరవాణే. అనంతరం విమానంలో పర్వత శ్రేణుల్లో చక్కర్లు కొట్టారు. అలాగే కాఠ్మాండూ శివపురిలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కళాశాలలో శిక్షణలో ఉన్న అధికారులతో భేటీ అయ్యారు నరవాణే. తన అనుభవాలను వారితో పంచుకున్నారు.
మూడు రోజుల నేపాల్ పర్యటనలో భాగంగా ఇప్పటికే ఆ దేశ సైన్యాధిపతి పూర్ణచంద్ర థాప సహా కీలక నేతలు, అధికారులతో భేటీ అయ్యారు నరవాణే.
సరిహద్దు వివాదంతో భారత్-నేపాల్ మధ్య మైత్రి ఇటీవలే బలహీనపడింది. ఈ నేపథ్యంలో భారత సైన్యాధిపతి నేపాల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: నేపాల్ ఆర్మీ చీఫ్‌తో నరవాణే కీలక చర్చ