చైనా దూకుడు పెరుగుతున్న వేళ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమన్వయంతో పనిచేయాలని చతుర్ముఖ కూటమి దేశాలు నిర్ణయించాయి. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ నిర్మాణం కోసం సమష్టిగా పనిచేసేందుకు సభ్యదేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు అంగీకరించాయి. జపాన్‌లోని టోక్యోలో మంగళవారం జరిగిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత కోసం సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం ఓ ప్రకటనలో తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి సహా ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని జపాన్ ప్రధాని సుగా అన్నారు. ఈ నేపథ్యంలో చతుర్ముఖ కూటమి సభ్యదేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు.
ప్రాదేశిక సమగ్రత..
అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించడం సహా వివాదాల శాంతియుత పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ స్పష్టం చేసింది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని దేశాల భద్రత, ఆర్థిక ప్రయోజనాలకే తమ ప్రాధాన్యమని సమావేశంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా స్వేచ్ఛాయుతమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ నిర్వహణ ప్రాధాన్యతను సమష్టిగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.
చైనా విమర్శలు..
క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంపై చైనా పెదవి విరిచింది. ప్రత్యేక కూటములకు బదులు బహుపాక్షిక సహకారం బహిరంగంగా, సమగ్రంగా, పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకునే విధంగా కాకుండా ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలని పేర్కొంది.