తమ దేశంపై భారత్ మెరుపుదాడులకు ప్రణాళిక రూపొందించిందంటూ పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసఫ్ ఆరోపించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు మొయీద్ శుక్రవారం చేసిన ట్వీట్లో.."షా మహమ్మద్ ఖురేషీ(పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి) యూఏఈలో అంతర్జాతీయ మీడియాకు ఈ విషయం చెప్పారు. మనకున్న నిఘా సమాచారం ప్రకారం పాక్‌పై భారత్ మెరుపు దాడులు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది," అని పేర్కొన్నారు.
ఈ ఆరోపణల్ని భారత జాతీయ భద్రత సలహా బోర్డు ఛైర్ పర్సన్ పీఎస్ రాఘవన్ తోసిపుచ్చారు. ఆయన 'ఈటీవీ భారత్'తో మాట్లాడుతూ.. భారత్‌కు వ్యతిరేకంగా కుటిల చర్యలకు పాల్పడటానికి పాకిస్థాన్ కుట్రలు పన్నుతోందన్నారు.
మరో అబద్ధం కూడా..
భారత సైన్యంపై కూడా పాకిస్థాన్ ఆర్మీ అసత్య ప్రకటనలు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి చిరికోట్ సెక్టార్లో భారత్ సైన్యం ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పులకు దిగిందని, ఐక్యరాజ్యసమితి మిలిటరీ పరిశీలకుల వాహనాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుందని పాక్ ఆర్మీ ఆరోపించింది. ఈ ఆరోపణలను దిల్లీలోని భారత సైనిక వర్గాలు తిప్పికొట్టాయి.
ఇదీ చదవండి : 'డ్రాగన్'తో సహకారం.. భారత్‌కు ఇబ్బందికరం