శ్రీలంక, భారత్ దౌత్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసే దిశగా కృషి చేస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శ్రీలంక పర్యటనలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపించలేదని అన్నారు. కొవిడ్ అనంతర పరిస్థితులపై ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు.
''ఇరు దేశాల సంబంధాలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపలేదు, నిజానికి మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశం కల్పించింది. గతేడాది మన ప్రధానమంత్రుల మధ్య జరిగిన వర్చువల్ సమావేశమే అందుకు ఉదాహరణ. శ్రీలంకలోని తమిళుల హక్కుల పరిరక్షణ ఆ దేశం చేతిలోనే ఉంది."
-జైశంకర్, భారత్ విదేశాంగ మంత్రి.
''సరిహద్దు దేశాలకు ప్రాధాన్యం అన్న భారత్ సిద్ధాంతం మా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. వైద్య, ఆర్థిక రంగాల్లో ఎంతగానో ఉపయోగపడింది. మా తరఫున ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు."
-గుణవర్ధన, శ్రీలంక విదేశాంగ మంత్రి
ఇరు దేశాలకు సవాళ్లు..
కొవిడ్ టీకాపై భారత్ సాయం కావాలని శ్రీలంక కోరింది. దీనిపై స్పందిస్తూ తాము కృషి చేస్తానని జైశంకర్ అన్నారు. కొవిడ్ పరిస్థితుల నుంచి కోలుకోవడంపై ఇరు దేశాలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇది కేవలం ప్రజా ఆరోగ్య సమస్య కాదని, ఆర్థిక సమస్య కూడా అని పేర్కొన్నారు.
మత్స్యకారులను త్వరగా అప్పగించండి..
హిందు మహాసముద్రంపై భద్రత విషయంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఇటీవలే శ్రీలంకకు పట్టుబడ్డ భారత మత్స్యకారులను త్వరలోనే అప్పగిస్తారని ఆశిస్తున్నాన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి : కేరళలో మరొకరికి 'షిగెల్లా'- ఈసారి ఆరేళ్ల బాలుడికి