జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది అక్టోబర్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న వేళ.. ఈ ఇరువురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటుకానున్న భారత్-జపాన్ ఫ్రంట్ విఫలమవుతుందని విమర్శించింది.
అది విఫలమే...
సింగువా విశ్వవిద్యాలయంలోని నేషనల్ స్ట్రాటజీ ఇన్స్టిట్యూట్ పరిశోధనా విభాగం డైరెక్టర్ క్వింగ్ ఫెంగ్ గ్లోబల్ టైమ్స్‌లో ఈ కథనాన్ని రాసుకొచ్చారు. "చైనాకు వ్యతిరేకంగా భారత్, జపాన్ ఫ్రంట్ ఏర్పడాలనుకుంటే అది విఫలమవుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
"45 ఏళ్లలో సరిహద్దు వద్ద ఘర్షణ తర్వాత భారత్ ఏకపక్షంగా వ్యవహరించింది. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే టిక్‌టాక్, వీచాట్ వంటి 59 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. అయితే ఇందులోకి జపాన్, ఆస్ట్రేలియాను చైనాకు వ్యతిరేకంగా ఉసిగొల్పాలని భారత్ చూస్తోంది. ఇది ఎంతమాత్రం భారత ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి ఉపయోగపడదు. చైనాకు ఇబ్బంది కలిగించాలనుకుంటే భారత్ ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చైనా జాతీయ ప్రయోజనాలను సవాలు చేయడానికి భారత దేశానికి బలం సరిపోకపోవచ్చు" అని క్వింగ్ రాసుకొచ్చారు.
అలా జరగకపోవచ్చు..
"చైనా-భారత్, చైనా-జపాన్ మధ్య సత్సంబంధాలు చైనా-అమెరికా రీతిలో అంత వేగంగా దిగజారిపోవు. అయితే దిల్లీ మాత్రం సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బీజింగ్‌పై ఒత్తిడి తెస్తోంది. జపాన్ కూడా చైనాతో సత్సంబంధాలు మెరుగుపర్చుకోవాల్సి ఉంది. మహమ్మారి తర్వాత కాలంలో జపాన్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇరు దేశాలు చైనాను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవు" అని క్వింగ్ పేర్కొన్నారు.
భారత్, జపాన్‌తో చైనాకు కొన్ని విషయాల్లో వివాదాలు ఉన్నప్పటికీ.. దిల్లీ, టోక్యో కలిసి ఆసియాలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని క్వింగ్ అభిప్రాయపడ్డారు.
"భారత్-జపాన్ మధ్య సాధారణ సత్సంబంధమే ఉంటుందని అనుకుంటున్నాం. రెండూ ఆసియాలో పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు. ఇరుదేశాల మధ్య బంధం ఆసియా ప్రాంతంలో సహకారానికి అనుకూలంగా ఉంటుంది. అదే ద్వైపాక్షిక సంబంధం చైనాపై ఒత్తిడి తెచ్చేందుకే అయితే.. మేము దానికి అభ్యంతరం తెలుపుతాం. ఎందుకంటే ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తలకు కారణం అవుతుంది" అని పేర్కొన్నారు.
తేదీ ప్రకటించాల్సి ఉంది..
మోదీ, అబే భేటీపై ఇంకా విదేశాంగ శాఖ ఎటువంటి తేదీ ప్రకటించలేదు. అయితే మీడియా సమాచారం ప్రకారం ఇరుదేశాల మధ్య వర్చువల్ భేటీ సెప్టెంబర్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఏటా భారత్ వార్షిక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్న దేశాల్లో జపాన్, రష్యా ఉన్నాయి.
భారత్‌కు అండగా...
సరిహద్దులో చైనా దుశ్చర్యల్ని ఎండగడుతూ ఇప్పటికే కొన్ని అగ్రదేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. డ్రాగన్ దేశం దురాక్రమణ వైఖరిని అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఖండించగా.. జపాన్ కూడా బాసటగా నిలిచింది. ఏకపక్షంగా సరిహద్దులను మార్చే ఎలాంటి ప్రయత్నాలనైనా తాము వ్యతిరేకిస్తామని జపాన్ గత నెలలో స్పష్టం చేసింది.
ఎవరినీ ఉద్దేశించి కాదు..
గ్లోబల్ టైమ్స్ కథనంపై స్పందించారు జపాన్ స్టడీస్‌లో భారతీయ స్కాలర్ కేవీ కేశవన్. భారత్-జపాన్ సత్సంబంధాలు మూడో దేశం కోసం ఉద్దేశించినవి కావని అభిప్రాయపడ్డారు. 2014లో మోదీ ఆ దేశంలో పర్యటించినప్పుడే భారత్-జపాన్ సంబంధాన్ని "ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం" గా అభిప్రాయపడటాన్ని గుర్తుచేసుకున్నారు.
"భారత్- జపాన్ కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నాయి. ఆసియాలో శాంతి, సముద్ర భద్రతను కాపాడంలో ఇది ఉపయోగపడుతుంది. చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో కవ్వింపులకు పాల్పడుతోంది"అని కేశవన్ అన్నారు.
చైనాకు భారత్‌తో పాటు దక్షిణ చైనా సముద్రంలోనూ చాలా దేశాలతో వివాదాలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో శంకకు దీవులు కోసం టోక్యోతో ఎప్పట్నుంచో గొడవపడుతోంది చైనా. ఇటీవలే ఈ దీవుల్లో చైనా కోస్ట్‌గార్డ్‌లు అడుగుపెట్టడంపై జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సహా సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటోంది చైనా. అయితే భారత్ కూడా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం కలిసి పనిచేస్తామని ఈ దేశాలన్నీ తీర్మానించాయి.