చైనాతో సంబంధాలపై భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వద్ద అతిక్రమణలు ఉన్నంత కాలం ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగడం కష్టమేనని పేర్కొన్నారు. డ్రాగన్తో సంబంధాలు అత్యంత క్లిష్టమైనవిగా అభివర్ణించారు. రష్యా పర్యటన సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"సరిహద్దు వద్ద శాంతికి భంగం కలిగిస్తూ తరచూ అతిక్రమణలకు పాల్పడితే చైనాతో సంబంధాలు కొనసాగించడం కష్టం. గత కొద్ది రోజులుగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుందని ఆశిస్తున్నాము. కానీ భవిష్యత్తులో చైనాతో దౌత్యసంబంధాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం."
-హర్షవర్ధన్ ష్రింగ్లా, విదేశాంగ కార్యదర్శి
సరిహద్దుపై..
సరిహద్దుపై ఇరు దేశాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అవి పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యాపారం, విజ్ఞానం, సాంకేతికత అంశాల్లో పరస్పరం సహకరించుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కొత్త రకాలపై భారత్ టీకాలు పనిచేస్తాయా..?