తాలిబన్లు తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో అఫ్గానిస్థాన్ మహిళలు (afghan womens) తిరిగి తమ పరదాల మాటుకు వెళ్లిపోయారు. వారు ఇల్లు దాటి బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఆంక్షల మధ్య కాబుల్ మహిళలకు మాత్రం బయటకు వచ్చి తమ సాధకబాధకాలు చెప్పుకోవడానికి ఓ ప్రదేశం ఉంది తెలుసా..? అదే మొహడెస్సా నడుపుతున్న బ్యూటీ పార్లర్. దాన్ని మూసివేయించేందుకు తాలిబన్లు ఎన్నోసార్లు ఆమెను బెదిరించినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా తన చిన్నపాటి వ్యాపారాన్ని కొసాగిస్తున్నారు.
మొహడెస్సా బ్యూటీ పార్లర్ మహిళలకు ఇంటి బయట (womens in talibans rule) సేదతీరే ప్రదేశంగా మారిపోయింది. అక్కడ వారు తమ బాధలు చెప్పుకుంటున్నారు. కొత్త విషయాలు పంచుకుంటున్నారు. 'మేం మా పనిని కొనసాగిస్తాం. మాకు ఉద్యోగం ఉందని సంతోషిస్తున్నాం. ఇక్కడ చాలా మంది మహిళలకు ఈ పని అవసరం. ఇదే వారి కుటుంబాలకు పట్టెడన్నం పెడుతుంది' అని నిర్వాహకురాలు వెల్లడించారు. అలాగే ఇక్కడికి వచ్చే మహిళలు ఒళ్లంతా పరదాతో కప్పేసుకొని వస్తారు. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత తమ పరదా తొలగించి, పార్లర్‌లో తమకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకొని మురిసిపోతుంటారన్నారు. అయితే తాలిబన్ల నుంచి వచ్చే బెదిరింపుల మధ్య ఆమె దీన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నోసార్లు ఆ పార్లర్ బయట తాలిబన్లు దూషణకు పాల్పడ్డారు. 'ఈ భయాలన్నింటి మధ్య మా మహిళా ఉద్యోగులు పనిచేసేందుకు వస్తున్నారు. అందుకే వారు చాలా ధైర్యవంతులు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు వస్తున్నారు. పనిచేస్తున్నారు' అని ఆమె వెల్లడించారు.
ఇదీ చదవండి:Iraq News: ఇరాక్‌లో ఉగ్రదాడి- 11 మంది మృతి