పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితాన్ని ముప్పులో పడేసే వార్తలు భగ్గుమన్నాయి. అమెరికన్ అడ్వెంచరిస్ట్ సింథియా డాన్ రిచ్చీని తనతో శృంగారం చేయమని అప్పట్లో ఇమ్రాన్ అడిగినట్టు ప్రముఖ టీవీ హోస్ట్ అలీ సలీమ్ వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తాను, సింథియా ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవాళ్లమని సలీమ్ పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్లని తెలిపారు. ఆ సమయంలోనే.. ఇమ్రాన్ అడిగిన విషయాన్ని సింథియా తనతో పంచుకున్నట్టు వెల్లడించారు సలీమ్.
వివాదాల సింథియా...
అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్.. 2011లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు సంచలన ఆరోపణలు చేశారు సింథియా. గత శుక్రవారం జరిగిన ఓ ఫేస్బుక్ లైవ్ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ ప్రధాని యూసఫ్ రాజా గిలాని, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్ షాహబుద్దిన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన సలీమ్.. సింథియా తన ముందు ఈ విషయాలను ఎప్పుడూ ప్రస్తావించలేదన్నారు.
"ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడే అంత సన్నిహితంగా మేము ఉన్నప్పుడు... అత్యాచార ఘటనను కూడా సింథియా నాతో ప్రస్తావించేదే కదా. కానీ నాతో ఏం చెప్పలేదు."
-- అలీ సలీమ్, పాకిస్థాన్ టీవీ హోస్ట్.