పాకిస్థాన్లో కరోనా మహమ్మారి వచ్చే జులై, ఆగస్టు నాటికి ఉగ్రరూపం దాల్చనుందని పేర్కొన్నారు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు విస్మరించి అజాగ్రత్తగా ఉంటే దేశం దుర్భర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
దేశంలో కరోనా కేసులు లక్ష దాటిన నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు ఇమ్రాన్.
" వైరస్ వ్యాపిస్తుందని మాకు ఇప్పటికే తెలుసు. జులై లేదా ఆగస్టు నాటికి కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకుని ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీ ప్రియమైన వారు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికోసం ముందు జాగ్రత్తలు తీసుకోండి. లాక్డౌన్ విధిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతుంది కానీ, పాకిస్థాన్ పేద దేశం, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించటం తప్పా వేరే దారి లేదు."
- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి
కొవిడ్-19 కట్టడికి లాక్డౌన్ అనేది పరిష్కారం కాదని ప్రపంచమొత్తం అర్థం చేసుకుందని పేర్కొన్నారు ఇమ్రాన్. ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్యలో తొలిస్థానంలో ఉన్న అమెరికానే కార్యకలాపాలను ప్రారంభించిందని గుర్తుచేశారు. కరోనా వ్యాప్తి కట్టడికి పలు మార్గదర్శకాలతో దేశంలో అన్ని సేవలు ప్రారంభిస్తామన్నారు.
ఇదీ చూడండి: భారత్లో కరోనా ఉగ్ర రూపం అప్పుడే!