2015లో అఫ్గానిస్థాన్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్(ISIS khorasan) అనతికాలంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థగా అవతరించింది. ఐసిస్‌కు అనుబంధ సంస్థ అయిన ఐసిస్-కే.. గురువారం కాబుల్ విమానాశ్రయం వద్ద జంట ఆత్మాహుతి దాడులకు పాల్పడి(Kabul Airport Blast) ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ తీవ్రవాద సంస్థ ఇంత శక్తిమంతంగా బలపడటానికి దానికి అందిన రూ.వేల కోట్ల నిధులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎన్జీఓలు, విదేశీ విరాళాలు, సున్నపు గనుల ద్వారా ఐసిస్-కేకు భారీ ఆర్థిక సాయం అందినట్లు తెలిపారు.
ఐసిస్-కేను స్థాపించిన తొలినాళ్లలో దీని మాతృ సంస్థ ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఇన్ సిరియా అండ్ లెవాంట్-ISIS ) నుంచి నిధులు అందేవి. అయితే తమ ప్రాబల్యం తగ్గి నిధుల కొరత ఏర్పడిన తర్వాత.. స్వతహాగా నిధులు సమకూర్చుకోవాల్సిందేనని ఐసిస్.. ఐసీస్-కేకు స్పష్టం చేసింది. అప్పటి నుంచి నిధుల వేట మొదలుపెట్టింది ఈ ఉగ్రసంస్థ.
తొలుత ఖైబర్ పాస్ చట్టుపక్కల జరిగే స్మగ్లింగ్‌పై నియంత్రణ కోసం పోరాడి సఫలీకృతమైంది ఐసిస్-కే. కునార్ ప్రావిన్సులోని సున్నపు గనులు, కలపను ముఖ్య ఆర్థిక వనరులుగా మార్చుకుని నిధులు సమాకూర్చుకుంది.
ఏడాదిలోనే రూ.2వేల కోట్లు..
కాబుల్‌లోని అఫ్గాన్ వ్యూహాత్మక పరిశోధనల సంస్థ-AISS నివేదిక ఆధారంగా ఓ నిపుణుడి అంచనా ప్రకారం.. స్థాపించిన తొలి ఏడాదిలోనే ఐసిస్-కేకు(ISIS khorasan) 271 మిలియన్ డాలర్లు(రూ.2వేల కోట్లు) నిధులు సమకూరాయి. ఇందులో ప్రైవేటు దాతల నుంచి అందినవి 120 మిలియన్ డాలర్లు. సిరియా, ఇరాక్‌లోని ఐసిస్ నుంచి వచ్చినవి 78 మిలియన్ డాలర్లు. అరబ్ గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 40 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. జకాత్ రూపంలో 33 మిలియన్ డాలర్లు వచ్చాయి.
ఎన్జీఓ కీలక పాత్ర..
అయితే ఐసిస్-కేకు నిధులు సమకూర్చే విషయంలో 'నెజాత్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్' అనే ఎన్జీఓ కీలక భూమిక పోషించింది. ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తోందని 2019 నవంబర్ 18న దీనిపై అమెరికా అంక్షలు విధించింది. ఐసిస్-కేకు కేవలం ఆర్థికపరంగానే కాకుండా అవసరమైన మెటీరియల్, సాంకేతిక సహకారం, వస్తువులు సమకూర్చుతూ అన్ని విధాలా నెజాత్ సాయం అందించింది.
నెజాత్లో పనిచేసే వ్యక్తే ఐసిస్-కే నియామకుడిగా వ్యవహరించేవాడు. ఐసిస్ కోసం కాబుల్‌లోనే నియామకాలు జరిపేవాడు. కొత్తగా వచ్చే వారిని నంగర్హార్ ప్రావిన్సు చేర్చేందుకు ఇతడే ప్రయాణ ఏర్పాట్లు చేసేవాడు. ఈ ఎన్జీఓ ముసుగులోనే కోట్ల రూపాయల నిధులు ఐసిస్-కేకు బదిలీ అయ్యేవి. 2016 చివర్లో సలాఫీ సంఘీభావ సమావేశం పేరుతో నెజాత్ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఐసిస్-కే నాయకులు ప్రణాళికలు రూపొందించుకునేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెజాత్ కార్యనిర్వహక సభ్యులు సహా సలాఫీ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు నెజాత్కు ఆర్థిక సాయం అందించేవారున్నారు.
బ్యాంకుల ద్వారా బదిలీ..
ఖతార్, యూఏఈ, ఇరాక్, ఇతర పశ్చిమాసియా దేశాల నుంచి ఐసిస్-కే(ISIS khorasan) తరఫున నెజాత్ విరాళాలు సేకరించేంది. అనంతరం వాటిని బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా గల్ఫ్ నుంచి ఆసియాకు బదిలీ చేసేది. ఈ నగదును కాబుల్, జలాలాబాద్‌లోని నెజాత్ కార్యాలయం నుంచి ఐసిస్-కే సమన్వయకర్త సేకరించేవాడు. అనంతరం వాటిని తమ కమాండర్లకు పంపిణీ చేసేవాడు.
నెజాత్ డైరెక్టర్..
నెజాత్ను నిర్వహించే వారిలో కువైట్‌కు చెందిన సయెద్ అహ్మద్ ఖాన్ కీలకంగా వ్యవహరించేవాడు. ఇతడే దీనికి డైరెక్టర్. నెజాత్ కార్యనిర్వహక సభ్యుడు రోహుల్లా కూడా ప్రధాన పాత్ర పోషించేవాడు. వీరితో పాటు ఐసిస్‌కు సహకరించే ముఖ్య వ్యక్తుల్లో మాల్దీవులకు చెందిన మొహమద్ అమీన్ ఒకరు. డిజిటల్ మీడియా ఆపరేషన్స్ బాధ్యతను ఐసిస్ ఇతడికే అప్పగించింది. మాల్దీవుల నుంచి ఐసిస్ కోసం నియామకాలు కూడా ఇతడే చేపట్టేవాడు.
2019 ఏప్రిల్ నాటికే అమీన్ ఐసిస్ కోసం వారానికి కనీసం 10 రిక్రూట్మెంట్ సెషన్లు నిర్వహించేవాడు. మొదట్లో సిరియా కోసం నియామకాలు చేపట్టిన ఇతడు.. ఆ తర్వాత అఫ్గాన్‌కు మాత్రమే ఫైటర్లను పంపేవాడు.
ఐసిస్ కోసం నియమకాలు చేపట్టే వారిలో లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) ఉగ్రవాది అబ్దుల్ పేఖ్ ఖొరసాని కూడా ముఖ్య పాత్ర పోషించాడు. 1998 వరకు కశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహించిన ఇతడు.. ఆ తర్వాత సిరియాకు మకాం మార్చాడు. అఫ్గాన్ కునార్‌లో ఐసిస్ బ్యానర్ ఎత్తిన తొలి వ్యక్తి కూడా ఇతడే అని చెబుతుంటారు.
(రచయిత- సంజీవ్ కుమార్ బారువా, సీనియర్ జర్నలిస్ట్)
ఇవీ చదవండి: Afghan Taliban: 'అవన్నీ తిరిగిచ్చేయండి'.. పౌరులకు తాలిబన్ల ఆర్డర్
Panjshir Valley: 'పంజ్‌షేర్‌లోకి తాలిబన్లా? ఒక్కరూ అడుగుపెట్టలేదు!'
Afghan crisis: అఫ్గాన్ సంక్షోభంపై అమెరికా, చైనా సైనిక చర్చలు!