కరోనా వైరస్ విషయంలో చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వత్తాసు పలుకుతోందని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సంస్థకు నిధులు పూర్తిగా నిలిపివేశారు. డబ్ల్యూహెచ్‌వోకు ఏటా తాము దాదాపు రూ.3,833 కోట్ల వరకు నిధులు సమకూరుస్తుంటే.. చైనా కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇంతకీ డబ్ల్యూహెచ్‌వోకు డబ్బులు ఎలా వస్తాయ్? ఏయే దేశాల భాగస్వామ్యం ఎంత? అనేది ఓ సారి చూద్దాం.
చైనా కంటే మనమే అధికం..
ట్రంప్ చెప్పినట్లు డబ్ల్యూహెచ్‌వోకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చేది అమెరికానే. ఈ సంస్థకు వచ్చే నిధుల్లో అమెరికా వాటా 14.67 శాతం. ఆ స్థాయిలో బిల్‌గేట్స్‌కు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 9.76 శాతం నిధులు అందిస్తోంది. జెనీవా కేంద్రంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేసే 'గవి' అలయన్స్ 8.39 శాతం, యూకే (7.79 శాతం), జర్మనీ (5.68 శాతం) పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తున్నాయి.
ఐరాస కో-ఆర్డినేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ (5 శాతం), ప్రపంచ బ్యాంకు (3.42 శాతం), రోటరీ ఇంటర్నేషనల్ (3.3 శాతం), యూరోపియన్ కమిషన్ (3.3 శాతం), జపాన్ (2.7 శాతం) చొప్పున డబ్ల్యూహెచ్‌వోకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తున్నారు. ట్రంప్ చెప్పినట్లు డబ్ల్యూహెచ్‌వోకు చైనా సాయం నామమాత్రమే. మొత్తం నిధుల్లో ఆ దేశం కేవలం 0.21 శాతం మాత్రమే ఇస్తోంది. అదే సమయంలో భారత్ 0.48 శాతం, పాకిస్థాన్ 0.36 శాతం, ఫ్రాన్స్ 0.5 శాతం తమ వాటాలు అందజేస్తున్నాయి.
నిధులు రాక ఇలా..
డబ్ల్యూహెచ్‌వోకి వాలంటరీగా సమకూరే నిధులే అధికం. దాదాపు 80 శాతం ఈ విధంగా వచ్చేవే. డబ్ల్యూహెచ్‌వోలో 194 సభ్య దేశాలు సహా ఎన్జీవోలు ఈ నిధులను ఇస్తున్నాయి. అయితే, ఇవి రెండు రకాలుగా ఉంటాయి. సంస్థ తన అవసరాలు, ప్రాధాన్య అంశాలకు ఖర్చు చేయడానికి వినియోగించే నిధులను కోర్ వాలంటరీ కంట్రిబ్యూషన్ అంటారు. ప్రత్యేకించి ఒకదానిపై మాత్రమే ఖర్చు చేయడానికి వీలుండే నిధులను స్పెసిఫైడ్ వాలంటరీ కంట్రిబ్యూషన్‌గా పేర్కొంటారు.
డబ్ల్యూహెచ్‌వోలో సభ్యత్వానికి గానూ చెల్లించే మొత్తాన్ని అసెస్డ్ కంట్రిబ్యూషన్ అంటారు. ఇది దాదాపు 17 శాతంగా ఉంటుంది. అయితే, ఒక్కోదేశానికి ఒక్కోలా ఈ ఫీజు నిర్ణయించారు. ఇందుకోసం ఒక్క అమెరికానే దాదాపు 15 శాతం నిధులు అందజేస్తోంది. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల కట్టడికి కోసం ఏర్పాటు చేసిన పాండమిక్ ఇన్‌ఫ్లూయెంజా ప్రిపేర్డ్‌నెస్ కింద మరో 3 శాతం వరకు నిధులు డబ్ల్యూహెచ్‌వోకు అందుతాయి.