హగీబిస్ తుపాను బీభత్సానికి జపాన్ విలవిలలాడింది. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో తుపాను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు సుమారు 70మంది మరణించారు. మరో 15మంది గల్లంతయ్యారని స్థానిక మీడియా తెలిపింది.
ప్రధాని స్పందన
హగీబిస్ తుపానుపై జపాన్ పార్లమెంటరీ సమావేశంలో స్పందించారు ఆ దేశ ప్రధాని షింజో అబే. దేశంలో టైపూన్ తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చిందన్నారు. నష్టం మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిపారు.
ప్రజల అవస్థలు
శనివారం జపాన్లోని ప్రధాన ద్వీపాన్ని హగీబిస్ తుపాను తాకింది. భీకరమైన ఈదురు గాలులు, వర్షాల ప్రభావంతో దేశంలోని 200 నదులు ఉప్పొంగాయి. తుపాను కారణంగా ఇప్పటి వరకు సుమారు 34వేల ఇళ్లల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరా నిలిచిపోయి దాదాపు లక్షమంది అవస్థలు పడుతున్నారు.
సెంట్రల్ టోక్యోలో తుపాను కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల వ్యాపారాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. స్థానికులంతా తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడం ప్రారంభించారు. నగానో, ఫుకోషిమా లాంటి ప్రాంతాల్లో వరద ధాటికి ప్రజల జీవనం స్తంభించిపోయింది.
రైళ్లు నిలిచిపోయాయి
తుపాను నేపథ్యంలో టోక్యో సహా అనేక ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగానోలో ఆరు బుల్లెట్ రైళ్లు వరదలో చిక్కుకున్నాయి.
ఇదీ చూడండి:తుపాను ధాటికి జపాన్ విలవిల- 11 మంది బలి